తెలంగాణలో నేడు, రేపు కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణలో నేడు, రేపు కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Telangana Rains Red Alert Issued For Several Districts Today And Tomorrow
  • 5 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ముగ్గురు మహిళల మృతి
  • భద్రాద్రి జిల్లాలో పాఠశాలలకు రెండు రోజులు సెలవులు
తెలంగాణలో నేడు, రేపు (గురు, శుక్రవారాలు) అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.

బుధవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో రోజంతా ముసురు పట్టింది. ఖమ్మం జిల్లా కల్లూరులో అత్యధికంగా 6.28 సెం.మీ వర్షపాతం నమోదైంది. రెడ్ అలర్ట్ జారీ చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఇదే జిల్లా బూర్గంపాడు మండలంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. పలు ఇళ్ల పైకప్పులు, హోర్డింగులు ఎగిరిపడ్డాయి.

ఈ వర్షాల కారణంగా విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరులో లక్ష్మి (35), జడ్చర్లలో యాదమ్మ (66), పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో అంజమ్మ (55) మృతి చెందారు. పిడుగుపాటు వల్ల మరికొందరు గాయపడగా, పశువులు కూడా మృత్యువాత పడ్డాయి.
Advertisement
Telangana Rains
Red Alert Districts
Heavy Rainfall Forecast
Hyderabad Meteorological Centre
Low Pressure Bay of Bengal
Telangana Weather Update

More Telugu News