రేవంత్ రెడ్డికి నెల రోజుల డెడ్ లైన్ విధించిన కవిత

రేవంత్ రెడ్డికి నెల రోజుల డెడ్ లైన్ విధించిన కవిత

Kavitha sets one month deadline for Revanth Reddy
  • ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాదానికి ప్రభుత్వమే కారణమన్న కవిత
  • ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోతే రేవంత్ కు పరామర్శించే సమయం కూడా లేకపోయిందని మండిపాటు
  • నెల రోజుల్లోగా ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని హెచ్చరిక

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ లో చోటుచేసుకున్న ఏసీ పేలుడు ఘోర ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఈ ఘటనలో ఐదుగురు పసికందులు మరణించడం అత్యంత ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి ఆదిలాబాద్‌లోని సురక్ష చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి తల్లిదండ్రులను నేడు ఆమె పరామర్శించి ఓదార్చారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదుగురు గిరిజన, మైనార్టీ పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతే కనీసం వచ్చి పరామర్శించే సమయం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. వైఫల్యాలను ఎండగడుతూ, సీఎంకు నెల రోజుల గడువు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవధిలోగా ప్రభుత్వ ఆసుపత్రుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, గిరిజన గూడేలకు రహదారి సదుపాయాలు కల్పించాలని, కేంద్ర నిధుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 


ఆసుపత్రులకు నిధులు కేటాయించకపోతే ఆదివాసీలతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘ఘెరావ్’ చేపడతామని హెచ్చరించారు. రిమ్స్‌లో 150 ఏసీలు ఉన్నా ఒక్క మెకానిక్ కూడా లేకపోవడం, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో రూ.500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు.

Advertisement
Kalvakuntla Kavitha
Revanth Reddy
Adilabad RIMS Hospital
Adilabad AC Blast
Telangana Healthcare Negligence
Aarogyasri Pending Bills

More Telugu News