వినాయకుడి మెడలో నోట్ల దండ చోరీ.. చాకచక్యంగా పట్టుకున్న యువకులు
- వేములవాడ వినాయక వేడుకల్లో ఆసక్తికర ఉదంతం
- వినాయకుడికి రూ. 50 వేల విలువైన నోట్ల దండను అలంకరించిన నిర్వాహకులు
- తెల్లవారుజామున దండను చోరీ చేసిన యువకుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక చవితి వేడుకల వేళ ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పట్టణంలోని బద్దిపోచమ్మ వీధిలో జీవైసీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని విగ్రహానికి రూ. 500 నోట్లతో రూపొందించిన రూ.50 వేల విలువైన భారీ నోట్ల దండను నిర్వాహకులు ఎంతో భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అయితే, తెల్లవారుజామున సమయం చూసి అక్కడకు చేరుకున్న ఓ అపరిచిత వ్యక్తి ఆ నోట్ల దండను కాజేశాడు.
అయితే, మండపం సమీపంలో ఉన్న యూత్ సభ్యులు ఆ చోరీ యత్నాన్ని వెంటనే గమనించారు. దీంతో భయపడి పారిపోతున్న నిందితుడిని యువకులు వెంబడించి, కొంతదూరంలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.50 వేల విలువైన నోట్ల దండను స్వాధీనం చేసుకుని, నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అదుపులోకి తీసుకున్న యువకుడి నేపథ్యంపై విచారణ వేగవంతం చేశారు.