ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు: గెలిచే ఛాన్స్ అలా చేజార్చుకున్న కాంగ్రెస్!

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు: గెలిచే ఛాన్స్ అలా చేజార్చుకున్న కాంగ్రెస్!

Delhi University Elections How Congress Lost the Chance to Win
  • ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐకి ఘోర పరాజయం
  • టికెట్ల కేటాయింపులో చేసిన పొరపాటే ఓటమికి కారణమని విశ్లేషణ
  • టికెట్ నిరాకరించడంతో రెబల్‌గా పోటీ చేసిన దీపాంశు షోకీన్ ఘనవిజయం
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన ఎన్ఎస్‌యూఐకి ఏబీవీపీ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏబీవీపీ మూడు కీలక స్థానాలను కైవసం చేసుకోగా, ఎన్‌ఎస్‌యూఐ టికెట్ నిరాకరించిన ఒక రెబల్ అభ్యర్థి ఉపాధ్యక్ష పదవిని భారీ మెజారిటీతో గెలుచుకోవడం గమనార్హం. టికెట్ల కేటాయింపులో నాయకత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే ఈ పరాజయానికి దారితీసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఈ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేయడంలో రెండు నిర్ణయాలు ప్రధాన పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలుత అధ్యక్ష అభ్యర్థిగా భావించిన దీపాంశు షోకీన్‌ను చివరి నిమిషంలో పక్కన పెట్టడం ఎన్ఎస్‌యూఐ చేసిన అతిపెద్ద తప్పిదంగా మారింది. ఏబీవీపీ అభ్యర్థి కూడా జాట్ వర్గానికి చెందిన నేత కావడంతో ఓట్లు చీలకుండా ఉండేందుకు, తాను అధ్యక్ష పదవికి బదులుగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తానని షోకీన్ ప్రతిపాదించారు. అయితే, ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌ఛార్జ్ కన్హయ కుమార్ దీనిని క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి, అతడిని ప్యానెల్ నుంచి తొలగించారు.

షోకీన్ స్థానంలో విజయ్ శంకర్ మీనాను అధ్యక్ష బరిలోకి దించిన పార్టీ, ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ ఛత్రత్ కుమారుడు వీర్ ఛత్రత్‌కు టికెట్ ఇచ్చింది. షోకీన్ నిష్క్రమణతో చేజారుతున్న జాట్ సామాజిక వర్గ ఓట్లను కాపాడుకునేందుకు, జాయింట్ సెక్రటరీ అభ్యర్థిగా ఉన్న విశేష్ యాదవ్‌ను మార్చి అతని స్థానంలో గోపాల్ చౌదరిని నిలబెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన విశేష్ యాదవ్ సైతం రెబల్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

ఎన్నికల ఫలితాల్లో ఈ పరిణామాలు స్పష్టమైన ప్రభావాన్ని చూపాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దీపాంశు షోకీన్ ఏకంగా 13,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఎన్‌ఎస్‌యూఐ అధికారిక అభ్యర్థికి కనీసం 'నోటా' కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. అధ్యక్ష పదవికి పోటీ చేసిన విజయ్ శంకర్ మీనా కేవలం 2,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. జాయింట్ సెక్రటరీ రేసులో ఏబీవీపీ విజయం సాధించగా, రెబల్ అభ్యర్థి విశేష్ యాదవ్ రెండో స్థానంలో, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

ఈ అనూహ్య పరాజయంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించగా, రాహుల్ గాంధీ స్వయంగా కన్హయ కుమార్ నుంచి వివరణ కోరినట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్, హాస్టల్ పైకప్పు కూలిన ఘటనల వంటి అంశాలతో విద్యార్థుల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, తప్పుడు వ్యూహాల కారణంగా కాంగ్రెస్ అద్భుతమైన విజయావకాశాన్ని చేజార్చుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Advertisement
NSUI
Delhi University Elections
DUSU Election Results
Deepanshu Shokeen
Kanhaiya Kumar
ABVP

More Telugu News