తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్న మాజీ మావోయిస్టులు
- లంకా పాపిరెడ్డి, అడ్వొకేట్ బల్ల రవీంద్రనాథ్ నేతృత్వంలో పార్టీ
- పార్టీ నిర్మాణంలో దేవ్‌జీ, సంగ్రామ్ ల భాగస్వామ్యం లేనట్టు సమాచారం
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీ
తెలంగాణ దశాబ్దాల సామాజిక, రాజకీయ ఆకాంక్షలకు, ఉద్యమ భావజాలానికి ప్రాతిపదికగా రాష్ట్ర రాజకీయ యవనికపై త్వరలోనే నూతన పార్టీ ఆవిర్భవించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దాదాపు ఐదు దశాబ్దాలుగా విప్లవోద్యమాల్లో చురుగ్గా పనిచేసి, తదనంతరం సామాన్య జీవితంలోకి అడుగుపెట్టిన మాజీ మావోయిస్టులే ప్రధాన చోదకశక్తిగా ‘జన తెలంగాణ పార్టీ’ రూపుదిద్దుకుంటోంది.
లంకా పాపిరెడ్డి (లచ్చన్న), అడ్వొకేట్ బల్ల రవీంద్రనాథ్, గురిజాల రవీందర్‌రావులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యుదయవాదులు, పౌరహక్కుల ఉద్యమకారులు ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. అయితే, ఆపరేషన్ కగార్ అనంతర పరిణామాల్లో బయటకు వచ్చిన దేవ్‌జీ-సంగ్రామ్ లేదా సోనూ-ఆశన్న వర్గాలు ఈ పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావడం లేదని తెలుస్తోంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలోకి అడుగుపెడుతున్న ఈ కొత్త పార్టీ, త్వరలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ... హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. భారీ ప్రాజెక్టులు, జీడీపీ గణాంకాలే అభివృద్ధి కాదని, సామాన్యులకు ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, ప్రశ్నించే స్వేచ్ఛే అసలైన అభివృద్ధి ప్రామాణికాలని తమ విధానపత్రంలో పొందుపరచనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలమైనా ప్రజా సమస్యలు తీరలేదన్న అభిప్రాయంతో ఉన్న ఈ బృందం, త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పార్టీ నమోదు కోసం అధికారికంగా దరఖాస్తు చేయనుంది.