భద్రాద్రిలో తీవ్ర విషాదం: పార్క్ చేసిన కారులో ఊపిరాడక నాలుగేళ్ల బాలిక మృతి

భద్రాద్రిలో తీవ్ర విషాదం: పార్క్ చేసిన కారులో ఊపిరాడక నాలుగేళ్ల బాలిక మృతి

Tragedy in Bhadradri Four year old girl dies of suffocation in parked car
  • ఆడుకుంటూ కారు ఎక్కడంతో లాక్ అయిన డోర్లు
  • గంటల పాటు గాలించిన తర్వాత కారులో గుర్తించిన కుటుంబసభ్యులు
  • ఆసుపత్రికి తరలించినా ఫలితం శూన్యం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ పార్క్ చేసిన కారులోకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి, డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన జూలూరుపాడు మండలం వినోభా నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె తన్విశ్రీ (4) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ, అక్కడ నిలిపి ఉంచిన కారులోకి వెళ్ళింది. అయితే, కారు డోర్లు వాటంతట అవే లాక్ కావడంతో చిన్నారి లోపలే చిక్కుకుపోయింది. దీన్ని ఎవరూ గమనించకపోవడంతో సుమారు రెండు గంటల పాటు బాలిక కారులోనే ఉండిపోయింది. పాప ఎంతకీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు.

చివరికి అనుమానంతో కారులో పరిశీలించగా, ముందు సీట్ల మధ్య చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పాపను బయటకు తీసి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారులో గాలి ఆడకపోవడం వల్లే ఊపిరాడక బాలిక మరణించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్క్ చేసిన వాహనాల వద్ద పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కార్లను లాక్ చేసే ముందు లోపల ఎవరూ లేరని నిర్ధారించుకోవాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు. కాగా, తెలంగాణలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నల్గొండ జిల్లాలో, గతేడాది రంగారెడ్డి జిల్లాలోనూ చిన్నారులు ఇదే విధంగా కార్లలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
Advertisement
Tanvishree
Bhadradri Kothagudem
Child car death
Telangana tragedy
Julurupadu
Suffocation in parked car

More Telugu News