శిశు ఆహార ఉత్పత్తుల వివాదం.. నెస్లే ఇండియాకు చిక్కులు

శిశు ఆహార ఉత్పత్తుల వివాదం.. నెస్లే ఇండియాకు చిక్కులు

Nestle India faces trouble over baby food product controversy
  • నెస్లే ఇండియాపై చట్టపరమైన చర్యలు ప్రారంభించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
  • శిశు ఆహార ఉత్పత్తుల ప్రమోషన్లపై తీవ్ర అభ్యంతరం
  • కొన్ని ఫార్ములాల్లో బయోటిన్ స్థాయిలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తింపు
  • ఈ వార్తలతో నెస్లే ఇండియా షేర్లు సుమారు 2 శాతం పతనం
ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియాకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గట్టి షాక్ ఇచ్చింది. శిశువులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నెస్లే ఇండియాపై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది.

నాన్ ఎక్సెలియా ప్రో స్టేజ్ 1, లాక్టోజెన్ ప్రో 1 వంటి శిశు ఆహార ఉత్పత్తులకు సంబంధించి నెస్లే ఇండియా ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచార సామగ్రిని ఉంచినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. 'నాన్ ఎక్సెలియా ప్రోలో 5 HMOలు, వే ప్రోటీన్ ఉన్నాయి', 'లాక్టోజెన్ ప్రోలో సులభంగా జీర్ణమయ్యే వే ప్రోటీన్ ఉంది' వంటి క్లెయిమ్‌లతో ప్రచారం చేయడంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2020తో పాటు 1992 నాటి చట్టం ప్రకారం, శిశు ఆహార ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించే ఇటువంటి ప్రకటనలు పూర్తిగా నిషిద్ధం.

దీంతో పాటు, నెస్లే ఫార్ములా ఉత్పత్తుల్లో బయోటిన్ స్థాయిలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ తన తనిఖీల్లో కనుగొంది. ఈ ఉల్లంఘనలపై కంపెనీ నుంచి వివరణ కోరగా, సంస్థ సమర్పించిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ మూడు వేర్వేరు అడ్జుడికేషన్ కేసులు నమోదు చేసింది.

ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో నెస్లే ఇండియా షేర్లు సుమారు 2 శాతం వరకు నష్టపోయి, రూ. 1,345 వద్ద ట్రేడ్ అయ్యాయి. శిశు పోషకాహార ఉత్పత్తులకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించడంలో కంపెనీ విఫలమైందని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.
Advertisement
Nestle India
FSSAI
Baby Food Controversy
Nan Excellia Pro
Lactogen Pro
Food Safety Violations

More Telugu News