ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం: కవిత

ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం: కవిత

Kalvakuntla Kavitha predicts Congress defeat for neglecting Telangana employees
  • ఉద్యోగులతో విభేదించిన ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి రాలేదని కవిత వ్యాఖ్య
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని విమర్శలు
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ
  • 630 మండలాలకు 8 మంది పర్మినెంట్‌ ఎంఈవోలే ఉన్నారని విమర్శ
  • పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపణ
ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వారిని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా చూస్తామని కవిత చెప్పారు. ఉద్యోగులను గౌరవించేలా, వారు సంతోషంగా పనిచేసేలా తమ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ఉద్యోగం కన్నా ఉద్యమానికే ప్రాధాన్యం ఇచ్చి పోరాడారని కవిత గుర్తు చేశారు. రాష్ట్రంలో 630 మండలాలకు కేవలం ఎనిమిది మంది పర్మినెంట్‌ మండల విద్యాధికారులు (ఎంఈవోలు) ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉచిత, నాణ్యమైన విద్య అందాలంటే బలమైన యంత్రాంగం అవసరమని అన్నారు.

విద్యార్థుల వివరాలు, రిపోర్టుల పేరుతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్న పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.

ఉద్యోగుల సహకారం లేకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నీ సమర్థంగా అమలు చేయలేదని కవిత అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కూడా ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. మైకుల ముందు ఎన్ని గొప్పలు చెప్పినా పెన్షన్లు, యూరియా, రైతులకు విద్యుత్‌ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు పీఆర్సీ, డీఏలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు వాటిపై స్పందించలేదని అన్నారు.
Advertisement
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
Congress government Telangana
Telangana government employees
Telangana teachers problems
Telangana PRC and DA news

More Telugu News