శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ

CM Chandrababu to visit Tirumala Brahmotsavam today to offer silk robes
  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ
  • ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటన
  • రేపు ఎలక్ట్రిక్ బస్సులు, ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం
  • అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్న సీఎం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి ఏటా జరుగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో పాటు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

సీఎం పర్యటన వివరాల ప్రకారం.. 
ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు పయనమవుతారు. సాయంత్రం 6:20 గంటలకు తిరుమలలోని శ్రీ గాయత్రీ నిలయానికి చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 

రాత్రి 7:40 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా వెళ్లి రాత్రి 7:55 గంటల నుంచి 9:15 గంటల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకుంటారు. దర్శనం పూర్తయ్యాక గాయత్రీ నిలయంలోనే సీఎం రాత్రి బస చేస్తారు.

రేపు ఉదయం ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 8:40 గంటలకు వీఐపీ క్యూ కాంప్లెక్స్‌-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన 'ఎక్స్ పీరియన్స్ సెంటర్'ను ప్రారంభిస్తారు. తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఉదయం 9:15 గంటలకు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ వద్ద టీటీడీ ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్‌ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. 

ఆ తర్వాత 9:35 గంటలకు ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమావేశమై, తిరుమలలో భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. పర్యటన ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకు అమరావతికి తిరుగు పయనమవుతారు.
Advertisement
Chandrababu Naidu
Srivari Brahmotsavam
Tirumala Tirupati Devasthanams
Pattu Vastralu presentation
Tirupati development projects
SV Museum inauguration

More Telugu News