తన తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ కథను ప్రభుత్వ ఒత్తిడితో మార్చారన్న ప్రచారాన్ని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఖండించారు. సెన్సార్‌ బోర్డు అభ్యంతరాల వల్ల సినిమా నిలిచిపోయిందన్న వార్తల్లోనూ నిజం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ముంబైలో నిర్వహించిన సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ విషయాలపై స్పందించారు.

ప్రభుత్వం చెప్పడంతో కథను తిరిగి రాశారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సల్మాన్‌ అన్నారు. ‘‘ఇదంతా అబద్ధం. మా సినిమా సైనికులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఇరు దేశాల వైపు ఉన్న సైనికుల జీవితాలను ఇందులో చూపించాం. ఇందులో ఎవరి పట్లా ప్రతికూలత లేదు. పరిస్థితులే ప్రతికూలంగా ఉంటాయి’’ అని వివరించారు.

దర్శకుడు అపూర్వ లఖియా తొలుత మరో కథాంశంతో సినిమా రూపొందించారని సల్మాన్‌ వెల్లడించారు. ఈ చిత్రం మొదట ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ పేరుతో తెరకెక్కింది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఈ కథకు ప్రేరణగా నిలిచింది. అయితే ప్రస్తుత రూపంలో సైనికుల అనుభవాలు, వారి కుటుంబాల భావోద్వేగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సల్మాన్‌ తెలిపారు. సైనికులకు దేశమే మొదటి ప్రాధాన్యమని, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరికి సానుకూల భావాలు ఉన్నా పరిస్థితులు ఎదురైనప్పుడు దేశం కోసమే నిలబడతారని చెప్పారు. ఇరు వైపులా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. తాజా ప్రకటన ప్రకారం డిసెంబరు 4న థియేటర్లలోకి రానుంది. సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్‌, ముఖేశ్‌ రిషి, అంకుర్‌ భాటియా, జేన్‌ షా, అభిలాష్‌ చౌదరి తదితరులు నటిస్తున్నారు.