భోజనం చేసే పద్ధతి మార్చితే షుగర్‌ స్పైక్స్‌ తగ్గుతాయా? కార్డియాలజిస్ట్‌ 3 సూచనలు

భోజనం చేసే పద్ధతి మార్చితే షుగర్‌ స్పైక్స్‌ తగ్గుతాయా? కార్డియాలజిస్ట్‌ 3 సూచనలు

Will changing the way you eat reduce sugar spikes Cardiologist 3 suggestions
  • భోజనం తర్వాత గ్లూకోజ్‌ స్పైక్‌ వచ్చే ఛాన్స్‌
  • ముందుగా పీచు పదార్థాలు తీసుకోవాలని కార్డియాలజిస్ట్‌ సూచన
  • తర్వాత ప్రొటీన్‌, ఆరోగ్యకర కొవ్వులు తీసుకోవాలని సలహా
  • చివర్లో అన్నం, బ్రెడ్‌ వంటి పిండి పదార్థాలు తినాలని సూచన
  • శుద్ధి చేసిన చక్కెరలను తగ్గించాలని హితవు
భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగడాన్ని ‘గ్లూకోజ్‌ స్పైక్‌’ అంటారు. మధుమేహం ఉన్నవారికే కాదు.. ఇతరులకూ భోజనం తర్వాత చక్కెర స్థాయుల్లో వచ్చే మార్పులు ఆకలి, నీరసం, నిద్రమత్తుపై ప్రభావం చూపొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే భోజనం చేసే క్రమంలో చిన్న మార్పు ఈ పెరుగుదలను కొంత అదుపులో ఉంచేందుకు ఉపయోగపడొచ్చని కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అలోక్‌ చోప్రా సూచిస్తున్నారు.

ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆహారం తీసుకునే క్రమం గురించి వివరించారు. ఎక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారాన్ని తరచూ తీసుకుంటే రక్తంలో చక్కెర వేగంగా పెరిగి, ఆ తర్వాత తగ్గొచ్చు. దీంతో కొందరికి మళ్లీ త్వరగా ఆకలి వేయడం, తీపి పదార్థాలపై కోరిక పెరగడం, అలసట లేదా నిద్రమత్తు రావచ్చని ఆయన పేర్కొన్నారు.

ముందుగా పీచు పదార్థాలు
భోజనం ప్రారంభంలో పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని డాక్టర్‌ చోప్రా సూచించారు. ముఖ్యంగా ఆకుకూరల వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

తర్వాత ప్రొటీన్‌, ఆరోగ్యకర కొవ్వులు
ఆ తర్వాత ప్రొటీన్‌ ఉన్న ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనంలో చేర్చుకోవాలని సూచించారు.

చివర్లో అన్నం, బ్రెడ్‌
భోజనంలో అన్నం, బ్రెడ్‌ వంటి పిండి పదార్థాలు ఉంటే వాటిని పీచు, ప్రొటీన్‌, ఆరోగ్యకర కొవ్వుల తర్వాత తీసుకోవాలని చెప్పారు. శుద్ధి చేసిన చక్కెరలు, పిండి పదార్థాలను తగ్గించి.. సహజంగా ఉండే, తక్కువగా ప్రాసెస్‌ చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అయితే భోజనం చేసే క్రమం ఒక్కటే మధుమేహాన్ని నియంత్రించే మార్గం కాదు. మధుమేహం లేదా ప్రీడయాబెటిస్‌ ఉన్నవారు ఆహారం, వ్యాయామం, మందుల వంటి అంశాలన్నింటినీ వైద్యుల సూచన మేరకు పాటించాలి.
Advertisement
Dr Alok Chopra
Blood sugar spikes
Diabetes management
Healthy eating habits
Glucose level control
Meal sequence tips

More Telugu News