అసెంబ్లీలో రచ్చ.. బీజేపీకి అన్నింట్లో రాజకీయాలే కావాలంటూ కోమటిరెడ్డి ధ్వజం
- 22-ఏపై చర్చకు బీజేసీప సభ్యుల పట్టు
- భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినాదాలు
- బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయిందన్న కోమటిరెడ్డి
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో బీజేపీ సభ్యుల గందరగోళంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే, బీజేపీ ఎమ్మెల్యేలు 22-ఏ నిషిద్ధ భూముల అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని పట్టుబడుతూ ప్లకార్డులతో సభాప్రాంగణంలోకి దూసుకెళ్లారు. స్పీకర్ కల్పించుకుని... బీఏసీ సమావేశంలో చర్చించి 22-ఏపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయినప్పటికీ బీజేపీ సభ్యులు తగ్గలేదు. భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
మరోవైపు, బీజేపీ సభ్యుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "సభలో ఏ అంశంపైనైనా సుదీర్ఘంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే, బీజేపీ నాయకులకు మాత్రం అన్నింట్లో రాజకీయాలే కావాలి" అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ. లక్ష కోట్ల మేర భారీ అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని ఏడాది క్రితం లేఖ రాసినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్‌తో లోపాయికారీగా కుమ్మక్కై విచారణ జరగకుండా బీజేపీ అడ్డుపడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతి బయటకు రాకుండా స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలే అడ్డుపడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.
మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సభకు బీజేపీ సభ్యులు సహకరించాలని విన్నవించారు. ప్రొసీజర్ ప్రకారం సభ నడవాలని అన్నారు. 22-ఏపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.