మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం

Revanth Reddy holds emergency meeting with Ministers MLAs and MLCs
  • స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు
  • వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన రేవంత్ రెడ్డి
  • తాతా మధును బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం, ఇదే సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల దరిమిలా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, కీలక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆందోళనల సమయంలో స్పీకర్‌ను, పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడిన వీడియో ఫుటేజ్‌లను సీఎం స్వయంగా పరిశీలించి, అధికారులను ఆరా తీశారు. 


శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేత పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు ఇందుకు బాధ్యులైన బీఆర్‌ఎస్ సభ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎంతో భేటీ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన దళిత ఎమ్మెల్యేలు... బీఆర్‌ఎస్‌కు దళితులంటే ఆదినుంచీ చిన్నచూపేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళిత స్పీకర్‌ను అవమానించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని... సభ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, తాతా మధు చేసిన వ్యాఖ్యల వీడియోను సీఎం కార్యాలయం విడుదల చేసింది.

Advertisement
Revanth Reddy
Tata Madhu
BRS Party
Telangana Assembly Protest
Dalit Speaker Controversy
Telangana Politics

More Telugu News