నాయకులు అహంకారానికి దూరంగా ఉండాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

నాయకులు అహంకారానికి దూరంగా ఉండాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu says leaders should stay away from arrogance
  • నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్న రామ్మోహన్
  • అభ్యర్థి ప్రవర్తన ఎన్నికల్లో 68.9% ప్రభావం చూపుతుందని వెల్లడి
  • ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచన
  • ఎంత ఎదిగినా అహంకారం దగ్గరకు రానీయవద్దని హితవు
టీడీపీ ప్రజాప్రతినిధుల లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో కేంద్ర మంత్రి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రసంగం చేశారు. నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ పటిష్ఠంగా ఉంటుందని, ప్రజా జీవితంలో ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల్లో అభ్యర్థి ప్రవర్తన 68.9 శాతం వరకు గెలుపోటములను ప్రభావితం చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. ఉత్తమ పనితీరుతో నాయకత్వాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ఓటర్లు, పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని, ముఖ్యంగా జెన్ జీ యువత ఆలోచనలకు అనుగుణంగా మన కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు. కేవలం సమస్యలను గుర్తించడమే కాకుండా, వాటిని వేగంగా పరిష్కరించే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యలను ఓపికగా వినే సహనం నాయకులకు చాలా అవసరమని అన్నారు.

నాయకుడిగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అహంకారాన్ని దరిచేరనీయవద్దని రామ్మోహన్ నాయుడు హితవు పలికారు. ప్రవర్తనే నాయకుడికి అసలైన కొలమానమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Advertisement
Ram Mohan Naidu
TDP Leadership Conclave
Chandrababu Naidu
Andhra Pradesh Politics
TDP Election Strategy
Political Leadership Skills

More Telugu News