కెప్టెన్‌గా రింకు సింగ్ మ్యాజిక్.. మీరట్‌కు యూపీ టీ20 టైటిల్!

కెప్టెన్‌గా రింకు సింగ్ మ్యాజిక్.. మీరట్‌కు యూపీ టీ20 టైటిల్!

Rinku Singh Magic as Captain Meerut Wins UP T20 Title
  • ఫైనల్‌లో 40 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన ఓపెనర్ దివ్యాంశ్ జోషి
  • గాయంతోనే ఆడి జట్టును ఫైనల్ చేర్చిన కెప్టెన్ రింకు
  • కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ముందుకొచ్చిన రింకు సింగ్
భారత జట్టులో చోటు కోల్పోయినా తనలోని నాయకత్వ పటిమను, సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు యువ క్రికెటర్ రింకు సింగ్. ఆయన సారథ్యంలోని మీరట్ మేవరిక్స్ జట్టు యూపీ టీ20 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్‌పై 94 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్సీ రేసులో రింకు పేరు బలంగా వినిపిస్తోంది.

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మేవరిక్స్, ఓపెనర్ దివ్యాంశ్ జోషి విధ్వంసక సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు సాధించిన జోషి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే కెప్టెన్ రింకు సింగ్ ఈ మ్యాచ్‌లో 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది.

రింకు సింగ్ నాయకత్వంలో మీరట్ మేవరిక్స్ ఫైనల్ చేరడం ఇది వరుసగా నాలుగోసారి కాగా, టైటిల్ గెలవడం రెండోసారి (2024లో మొదటిది). ఈ టోర్నీలో కెప్టెన్‌గా రింకు అద్భుతంగా రాణించి 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 9 విజయాలు అందించాడు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో చేతికి గాయమైనా, పెయిన్‌కిల్లర్స్ తీసుకుని బరిలోకి దిగి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

యూపీ టీ20లో కెప్టెన్‌గా సాధించిన ఈ విజయం, ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్సీకి రింకు పేరును బలంగా తెరపైకి తెచ్చింది. గత సీజన్‌లో కేకేఆర్‌కు అజింక్యా రహానే కెప్టెన్‌గా, రింకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించారు. రహానే రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త సారథి కోసం కేకేఆర్ యాజమాన్యం అన్వేషిస్తోంది. జట్టులో సీనియర్ ఆటగాడిగా, కీలక ఫినిషర్‌గా నిలదొక్కుకున్న రింకు, 2026 సీజన్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో కేకేఆర్ భవిష్యత్ కెప్టెన్‌గా అతడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Advertisement
Rinku Singh
Meerut Mavericks
UP T20 League
KKR Captaincy Race
Lucknow Falcons
Divyansh Joshi

More Telugu News