జైశంకర్‌తో భేటీ.. భారత్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు!

S Jaishankar meets Zelenskyy as Ukraine President thanks India for peace efforts
  • జెలెన్‌స్కీతో జైశంకర్‌ కీలక భేటీ
  • యుద్ధం ముగింపుపై ప్రధానంగా చర్చ
  • భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన జెలెన్‌స్కీ
  • బ్లాక్‌ సీ పరిస్థితిపైనా చర్చ
  • శాంతి ప్రక్రియలో భారత్‌ పాత్రపై ఉక్రెయిన్‌ ఆశలు
ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌.. అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. భారత్‌-ఉక్రెయిన్‌ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు భారత్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

జైశంకర్‌తో భేటీ అనంతరం జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘‘ఈ అన్యాయమైన యుద్ధానికి ముగింపు పలకాలన్న భారత ఆకాంక్షకు కృతజ్ఞతలు. యుద్ధం ఆపి శాంతిని పునరుద్ధరించాలన్నదే భారత స్పష్టమైన వైఖరి’’ అని పేర్కొన్నారు.

నల్ల సముద్రం ప్రాంతంలో పరిస్థితులు, పౌర నౌకాయానానికి ఎదురవుతున్న ముప్పుపైనా చర్చించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఆహారం అవసరమైన ప్రాంతాలకు సరఫరాలు అడ్డుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తమ నౌకాశ్రయాలు, ధాన్యం కారిడార్‌, సరఫరాలను అడ్డుకోవడం ప్రపంచ సంబంధాల్లో తీవ్ర అంతరాయాలకు కారణమవుతోందని ఆరోపించారు.

జైశంకర్‌ కూడా జెలెన్‌స్కీతో భేటీ వివరాలను ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహాతో జరిగిన చర్చలను జెలెన్‌స్కీకి వివరించినట్లు చెప్పారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంతో పాటు యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి సిబిహాతో జైశంకర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యుద్ధం ముగింపు, బ్లాక్‌ సీ భద్రత, నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ ఆహార భద్రత అంశాలపై చర్చించారు. శాంతి ప్రక్రియలో భారత్‌ మరింత చురుకైన పాత్ర పోషించాలని ఉక్రెయిన్‌ కోరింది.

భారత్‌-ఉక్రెయిన్‌ మధ్య వాణిజ్యం ప్రస్తుతం 2.6 బిలియన్‌ డాలర్లుగా ఉందని సిబిహా తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, పునర్నిర్మాణంలో భారత కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ఉక్రెయిన్‌ భావిస్తోంది. ఇంధనం, మౌలిక వసతులు, రవాణా, వ్యవసాయం, ఔషధాలు, డిజిటలైజేషన్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు.

జైశంకర్‌ ఉక్రెయిన్‌ పర్యటన మరో విషయంలోనూ ప్రత్యేకంగా నిలిచింది. భారత విదేశాంగ మంత్రి ఉక్రెయిన్‌కు స్వతంత్ర ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి.
Advertisement
S Jaishankar
Volodymyr Zelenskyy
India Ukraine Relations
Russia Ukraine War
Black Sea Security
Global Food Security

More Telugu News