దేశభక్తిలో మోదీ, అమిత్‌ షాలకు అసద్‌ తక్కువేమీ కాదు: సీఎం రేవంత్‌

Revanth Reddy says Asaduddin Owaisi no less than Modi Amit Shah in patriotism
  • ఎంఐఎం దేశ వ్యతిరేకమనేది దుష్ప్రచారమన్న రేవంత్‌
  • ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై అసద్‌, అక్బర్‌తో చర్చించానని వెల్లడి
  • అసద్‌ సూచించిన అభివృద్ధి పనులను వెంటనే మంజూరు చేయాలని ఆదేశం
  • పాతబస్తీ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ
  • హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని వెల్లడి
ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు అసదుద్దీన్‌ ఒవైసీ ఏమీ తక్కువ కాదన్నారు. అసద్‌, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారం దుష్ప్రచారం మాత్రమేనని చెప్పారు.

సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జిని సీఎం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అసదుద్దీన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై తాను అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌తో చర్చించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జికి గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టిందే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే పనులు ముందుకు సాగాయని చెప్పారు. ఇన్నేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఓల్డ్‌సిటీకి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పాతబస్తీ గల్లీల్లోకి తాను తప్ప మరెవరూ రాలేదన్నారు.

అసద్‌ చెప్పిన పనులకు వెంటనే అనుమతులు
ఓల్డ్‌సిటీ అభివృద్ధి కోసం అసదుద్దీన్‌ ఏది సూచించినా వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్లు రేవంత్‌ చెప్పారు. పాతబస్తీలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. పెద్దలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

హిందూ, ముస్లింలు కలిసి ఉండాలి
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.
Advertisement
Revanth Reddy
Asaduddin Owaisi
Narendra Modi
Amit Shah
Old City Hyderabad development
Saidabad Steel Bridge

More Telugu News