ఒక్కరోజే రూ. 4000 జంప్... మళ్లీ రూ. 1.60 లక్షలకు చేరిన బంగారం

Gold price jumps by 4000 rupees in a single day to reach 160 lakh mark
  • ఆరు రోజుల నష్టాల తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర
  • మళ్లీ రూ. 1.60 లక్షల మార్కును దాటిన పసిడి
  • అమెరికా జాబ్ డేటా ప్రభావంతో బలహీనపడిన డాలర్
  • వెండి ధర సైతం కిలోకు రూ. 5000 మేర జంప్
గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై సుమారు రూ. 4,000 మేర పెరిగి, తిరిగి రూ. 1.60 లక్షల మార్కును దాటింది. బుధవారం రూ. 1,56,100 వద్ద ఉన్న తులం బంగారం ధర, గురువారం సాయంత్రానికి హైదరాబాద్ స్పాట్ మార్కెట్‌లో రూ. 1.60 లక్షలకు చేరుకుంది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర సుమారు రూ. 5,000 మేర పెరిగి రూ. 2.41 లక్షల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,477 డాలర్లుగా, వెండి ధర 66 డాలర్లుగా నమోదైంది.

అమెరికాలో ప్రైవేట్ రంగ ఉద్యోగాల కల్పన అంచనాల కంటే బలహీనంగా నమోదు కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.

ఫలితంగా అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువ తగ్గడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండికి డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. అంతకుముందు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు ధరల ఆందోళనల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.
Advertisement
Gold Price
Silver Price
Gold Rate Hyderabad
US Private Jobs Data
Bullion Market
US Federal Reserve

More Telugu News