మైక్రోసాఫ్ట్ జాబ్ వదిలేసి భారత్‌కు... ఓ యువకుడి భావోద్వేగ పోస్ట్

Ujjwal Chadha left Microsoft job to return to India emotional post goes viral
  • అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చిన ఉజ్వల్ చద్దా
  • జీతం తగ్గినా డబ్బుతో కొనలేని ఎన్నో విషయాలు పొందానని వెల్లడి
  • ఇమ్మిగ్రేషన్ ఆంక్షల నుంచి విముక్తి లభించిందని సంతోషం
  • తల్లిదండ్రులతో గడిపే అమూల్యమైన సమయం తిరిగి దొరికిందని భావోద్వేగం
అమెరికాలో ఏళ్లపాటు గడిపి, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఓ వ్యక్తి, ఉన్నతమైన జీవితాన్ని వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. తన నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తిగత కారణాలను వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. వలస, కుటుంబం, డబ్బు, జీవితం వంటి అంశాలపై ఇది కొత్త చర్చకు దారితీసింది.

ఉజ్వల్ చద్దా అనే వ్యక్తి మూడేళ్ల క్రితం యూఎస్‌లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. "మూడేళ్ల కిందట నేను యూఎస్, నా మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు తిరిగొచ్చాను. అక్కడుంటే సంపాదించే దానికంటే ఇక్కడ నా జీతం తక్కువే. కానీ, జీతంతో కొనలేని ఎన్నో విషయాలను నేను పొందాను" అని ఆయన తన 'ఎక్స్' ఖాతాలో రాసుకొచ్చారు.

అమెరికాలో వలసదారుడిగా ఇమ్మిగ్రేషన్ ఆంక్షల కారణంగా చిన్న చిన్న సంతోషాలను సైతం వాయిదా వేసుకోవాల్సి వచ్చేదని, భారత్‌కు వచ్చాక దానికి తెరపడిందని ఉజ్వల్ తెలిపారు. తన వీసా ఉద్యోగంపై ఆధారపడి లేకపోవడంతో, వృత్తిపరంగా ఎలాంటి భయాలు లేకుండా సొంతంగా ఉత్పత్తులను రూపొందించే స్వేచ్ఛ లభించిందన్నారు.

భారత్‌లో బలమైన వృత్తిపరమైన సంబంధాలు నిర్మించుకోవడం సులభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో నెట్‌వర్కింగ్ అంటే లింక్డిన్‌ సంభాషణలు, అప్పుడప్పుడు కాఫీ మీటింగ్‌లకే పరిమితమని, కానీ ఇక్కడ వ్యక్తులను నేరుగా కలవడం వల్ల మంచి అవకాశాలు, దృఢమైన బంధాలు ఏర్పడ్డాయని వివరించారు.

అన్నింటికంటే ముఖ్యంగా తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే అవకాశం లభించిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. "నా తల్లిదండ్రులను తిరిగి పొందాను. అదే జీవితంలో నేను యూఎస్‌లో ఉండి ఉంటే ఏడాదికి ఒక వారం మాత్రమే వారిని చూసేవాడిని. ఇప్పుడు ఎన్నో సాయంత్రాలను వారితో గడిపాను. డబ్బు తర్వాతైనా సంపాదించుకోవచ్చు. కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి పొందలేం కదా" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Ujjwal Chadha
Microsoft
USA to India migration
Tech career
Viral social media post
Indian techie returns home

More Telugu News