‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు’.. కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు!

Konda Murali says no one can handle the truth after Konda Surekha dismissal
  • కొండా సురేఖ బర్తరఫ్‌పై మురళి స్పందన
  • ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత
  • రాజకీయ కుట్రలపై పరోక్ష హెచ్చరికలు
  • పదవులు లేకపోయినా గౌరవం ఉంటుందన్న మురళి
  • వెనక్కి తగ్గేది లేదని స్పష్టమైన సంకేతాలు
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త, సీనియర్ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సురేఖ బర్తరఫ్‌ తర్వాత తొలిసారి స్పందించిన ఆయన.. ఎక్స్‌ వేదికగా భావోద్వేగంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరూ తట్టుకోరు” అంటూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు ఇంకెవరికి ఎదురవుతాయో అంటూ ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

పదవులు ఉన్నా లేకపోయినా తమ గౌరవం తమకు ఎప్పుడూ ఉంటుందని కొండా మురళి పేర్కొన్నారు. ప్రతి విషయానికీ వెంటనే స్పందించకపోవచ్చని.. కానీ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని లోతుగా గమనిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

తమపై అన్ని దరిద్రాలు ఒక్కటై కుట్రపూరితంగా రాజకీయ దాడులు చేశాయని మురళి ఆరోపించారు. అయితే తాము దేనికీ భయపడబోమని చెప్పారు. ఎంతటి కష్టాలు ఎదురైనా దృఢంగా నిలబడి తట్టుకుంటామని.. మొండిగా ఎదురువెళ్తామని పేర్కొన్నారు.

కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన వెంటనే కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తమపై జరిగిన రాజకీయ కుట్రలను తిప్పికొడతామన్న సంకేతాలను ఆయన తన పోస్టు ద్వారా ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు మధ్యాహ్నం సురేఖ బర్తరఫ్‌ వార్తలు బయటకు రాగానే మురళి తన నివాసం వద్ద తనదైన శైలిలో రియాక్షన్‌ ఇచ్చారు. బయటకు వచ్చి విలేకరులను చూస్తూ మీసం మేలేశారు. తాము ఏమాత్రం చింతించడం లేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని.. భరోసాతో ఉండాలని పరోక్షంగా కార్యకర్తలకు సూచించారు.
Advertisement
Konda Murali
Konda Surekha Dismissal
Telangana Politics
Konda Murali Reaction
Political Conspiracy
Konda Surekha Cabinet Removal

More Telugu News