బౌద్ధ సన్యాసిగా మారాలని... రూ.47 కోట్ల కంపెనీ అమ్మకానికి!

Thai businessman sells 47 crore company to become Buddhist monk
  • బౌద్ధ సన్యాసిగా మారాలని థాయ్ వ్యాపారవేత్త నిర్ణయం
  • రూ.47 కోట్లకు తన ఐస్‌క్రీం కంపెనీని అమ్మకానికి పెట్టిన వైనం
  • కొనుగోలుదారును పరిచయం చేస్తే రూ.1.4 కోట్ల రివార్డు ప్రకటన
  • గత 15 ఏళ్లుగా సన్యాసం స్వీకరించాలని ప్రణాళికలు
థాయ్‌లాండ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. బౌద్ధ సన్యాసిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనే సంకల్పంతో, ఆయన తన రూ. 47 కోట్ల విలువైన ఐస్‌క్రీం కంపెనీని అమ్మకానికి పెట్టారు. లౌకిక సుఖాలను వదిలి సన్యాస జీవితాన్ని స్వీకరించాలని ఆయన తీసుకున్న నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళితే థాయ్ వ్యాపారవేత్త సిరిపాంగ్ అకర్‌శ్రీయాక్ 1999లో ఒక ఐస్‌క్రీం బ్రాండ్‌ను స్థాపించారు. ఒకప్పుడు మార్కెట్‌లో విశేష ఆదరణ పొందిన ఈ సంస్థ, కాలక్రమేణా పెరుగుతున్న పోటీ కారణంగా కొంత మేర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. అయితే గత 15 ఏళ్లుగా సిరిపాంగ్ లౌకిక జీవితాన్ని పరిత్యజించి, బౌద్ధ భిక్షువుగా మారాలని యోచిస్తున్నారు.

పూర్తిస్థాయిలో సన్యాసం స్వీకరించేందుకు మరో రెండేళ్ల సమయం ఉందని, ఈలోపు ఒక ఆశ్రమాన్ని నిర్మించి ధ్యానంలో గడపాలని ఆయన భావిస్తున్నారు. తన కంపెనీని కొనుగోలు చేసే సరైన వ్యక్తిని పరిచయం చేసిన వారికి సుమారు రూ.1.4 కోట్లను కమీషన్‌గా అందజేస్తానని ప్రకటించడం గమనార్హం.

ఇప్పటికే బౌద్ధమతంపై పలు రచనలు చేసిన సిరిపాంగ్, బుద్ధుడి బోధనలపై తరుచూ ప్రసంగాలు చేస్తుంటారు. జ్ఞానోదయం పొందడమే తన జీవిత పరమార్థమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రూ.కోట్ల విలువైన వ్యాపారాన్ని వదులుకుని ఆధ్యాత్మిక పథం వైపు మొగ్గు చూపడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Advertisement
Siripong Akarsriyak
Thai businessman ice cream company
Buddhist monk transformation
Business sale for spirituality
Thailand ice cream brand sale

More Telugu News