కొండా సురేఖ బర్తరఫ్ ఆమె స్వయంకృతాపరాధం: ఆది శ్రీనివాస్

Konda Surekha dismissal is her own fault says Adi Srinivas
  • సురేఖకు పార్టీ, ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్న శ్రీనివాస్
  • అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకోలేదని వ్యాఖ్య
  • కుటుంబ సభ్యులను అదుపులో ఉంచుకోవడంలో విఫలమయ్యారని ఆరోపణ

మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించడం పూర్తిగా ఆమె స్వయంకృతాపరాధమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం సురేఖకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. సొంత కుటుంబ సభ్యులను అదుపులో ఉంచుకోవడంలో సురేఖ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు పదేపదే తీవ్రస్థాయిలో బహిరంగ విమర్శలు చేస్తూ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనూ వారిని వారించకపోవడం సురేఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో కూడిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అధిష్ఠానాన్ని సీఎం బ్లాక్‌మెయిల్ చేశారంటూ సురేఖ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.


అలాగే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించబడిన సీనియర్ నేత జి. చిన్నారెడ్డి అంశాన్ని కూడా ఈ సందర్భంగా విప్ ప్రస్తావించారు. చిన్నారెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవమని, గతంలో ఆయన గెలుపు కోసం రేవంత్ రెడ్డి శ్రమించారని గుర్తుచేశారు. అయితే ఎంతటి సీనియర్ నాయకులైనా సరే... పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పినందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆది శ్రీనివాస్ తెలిపారు.

Advertisement
Konda Surekha
Adi Srinivas
Revanth Reddy
Telangana Congress
Konda Surekha Dismissal
Telangana Politics

More Telugu News