బౌలింగ్ రనప్ కోసం 100 కి.మీ. పరుగు.. గిన్నిస్ రికార్డుకు క్రికెటర్ సాహసం.. ఇదిగో వీడియో!

Sam Bodovano runs 100 km for bowling run up for Guinness World Record
  • ప్రపంచంలోనే అత్యంత పొడవైన బౌలింగ్ రనప్ కోసం ఓ క్రికెటర్ ప్రయత్నం
  • గిన్నిస్ రికార్డు కోసం ఏకంగా 100 కిలోమీటర్లు పరుగెత్తిన సామ్ బొడొవానో
  • 14 గంటల పాటు సాగిన ఈ పరుగుతో క్యాన్సర్ ఛారిటీ కోసం నిధుల సేకరణ
  • ప్రస్తుత రికార్డు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ దూరం పరిగెత్తిన వైనం
  • రికార్డు గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సమీక్షించాల్సి ఉంది
క్రికెట్‌లో ఒక బంతి వేయడానికి బౌలర్ తీసుకునే రనప్ ఎంత ఉంటుంది? కొన్ని అడుగులు లేదా మహా అయితే ఓ 20-30 గజాలు. కానీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఓ క్రికెటర్ మాత్రం ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఏకంగా 100 కిలోమీటర్లు (62 మైళ్లు) పరుగెత్తాడు. సుదీర్ఘమైన బౌలింగ్ రనప్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించేందుకు ఈ సాహసానికి పూనుకున్నాడు.

సర్రేలోని వోర్పుల్స్‌డన్‌కు చెందిన సామ్ బొడొవానో అనే క్రికెటర్ ఈ అరుదైన ఫీట్‌కు ప్రయత్నించాడు. శనివారం లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో తన పరుగును ప్రారంభించి, 14 గంటల పాటు నిరంతరాయంగా పరిగెత్తి ఆదివారం వోకింగ్‌లోని వ్యాలీ ఎండ్ క్రికెట్ క్లబ్‌కు చేరుకున్నాడు. అక్కడ తన తండ్రికి తొలి బంతి వేసి తన రికార్డు ప్రయత్నాన్ని ముగించాడు. ఈ సాహసం వెనుక ఒక మ‌హత్త‌ర‌ కారణం కూడా ఉంది. రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ అనే క్యాన్సర్ ఛారిటీ కోసం నిధులు సేకరించడమే ఈ పరుగు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయత్నం ద్వారా బొడొవానో దాదాపు 6,000 పౌండ్స్‌ (భారత కరెన్సీలో సుమారు రూ. 7.64 లక్షలు) సేకరించాడు.

"చాలా అలసిపోయాను, రాత్రులు నిద్ర కూడా సరిగా లేదు. కానీ ఒక గొప్ప కారణం కోసం ఇదంతా చేశానన్న సంతృప్తి ఉంది" అని బొడొవానో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ రికార్డుకు అధికారిక గుర్తింపు లభించాలంటే కొన్ని కఠిన నిబంధనలు పాటించాలి. పరుగంతా పూర్తి క్రికెట్ దుస్తుల్లో, చేతిలో బంతి పట్టుకుని ఉండాలి. పరుగు ముగిశాక తప్పనిసరిగా ఒక మ్యాచ్ ఆడాలి. బొడొవానో ఈ నిబంధనలన్నింటినీ పాటించాడు.

అయితే, ఈ రికార్డు ఇంకా అధికారికంగా నమోదు కాలేదు. బొడొవానో సమర్పించిన ఆధారాలను క్షుణ్ణంగా సమీక్షించి, ధ్రువీకరించడానికి సుమారు రెండు వారాల సమయం పడుతుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాతే అధికారికంగా రికార్డును గుర్తిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అత్యంత పొడవైన బౌలింగ్ రనప్ (పురుషుల విభాగంలో) రికార్డు టామ్ డన్ పేరిట ఉంది. అతను 2024 ఆగస్టులో 24 కిలోమీటర్లు (15 మైళ్లు) పరిగెత్తి ఈ రికార్డు నెలకొల్పాడు. బొడొవానో ప్రయత్నం ప్రస్తుత రికార్డు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ దూరం కావడం విశేషం.
Advertisement
Sam Bodovano
longest bowling run up
Guinness World Record
Ruth Strauss Foundation
Lords Cricket Ground
cricket fundraising run

More Telugu News