ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. ఇక ఫ్రెషర్ల పరిస్థితేంటి?

Impact of AI on entry level jobs what is the situation of freshers
  • ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను ఆక్రమిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
  • కెరీర్ నిచ్చెనలో తొలి మెట్టును ఏఐ తొలగిస్తోందన్న నిపుణులు
  • భవిష్యత్తులో ఏఐని పర్యవేక్షించడమే జూనియర్ల ప్రధాన విధి
  • అనుభవం లేకుండా నైపుణ్యాలు పెరగవని నిపుణుల ఆందోళన
  • ఏఐకి అనుగుణంగా మారకుంటే వెనుకబడతారని హెచ్చరిక
కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశంతో అంతర్జాతీయ ఉద్యోగ విపణిలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా, మధ్యతరగతి యువతకు కెరీర్‌ పునాదిగా నిలిచే ప్రారంభ స్థాయి (ఎంట్రీ-లెవల్) ఉద్యోగాలపై 'ఏఐ' ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో నూతన ఉద్యోగులు చేసే సాధారణ, రిపీటెడ్‌ టాస్క్‌లను ఇప్పుడు 'ఏఐ' వేగంగా భర్తీ చేస్తుండటంతో, సంప్రదాయ కెరీర్ గమనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా ఏదైనా సంస్థలో చేరిన కొత్త ఉద్యోగి, ప్రాథమిక స్థాయి పనులు చేస్తూ సీనియర్ల పర్యవేక్షణలో వృత్తిపరమైన మెళకువలు నేర్చుకుని ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటారు. అయితే, ఏఐ ఈ 'తొలి మెట్టు'ను కాలరాస్తోందని టాలెంటిఫై-ఎక్స్ వ్యవస్థాపకుడు చేతన్ మంగల్వేధే అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జూనియర్ ఉద్యోగులు కేవలం విధులు నిర్వర్తించడం కాకుండా, 'ఏఐ' నితీరును పర్యవేక్షించడం, అందులోని లోపాలను సరిదిద్దడం, కస్టమర్ల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలను కలిగి ఉండాలని ఆయన వివరించారు.

ఏఐ కేవలం ఉద్యోగాలను భర్తీ చేయడం మాత్రమే కాకుండా, కెరీర్ ఎదుగుదల క్రమాన్నే సమూలంగా మార్చేస్తోందని మాస్టెక్ సీహెచ్ఆర్ఓ విమల్ డాంగ్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జూనియర్ రోల్స్‌లో రిపీటెడ్‌ టాస్క్‌ల కంటే సంక్లిష్ట సమస్యలు పరిష్కారం, విచక్షణ, బృందంతో కలిసి పనిచేయడం, నిరంతరం అభ్యాసం వంటి అంశాలపైనే ప్రధాన దృష్టి ఉంటుందన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపాంతరం చెందడంలో విఫలమవ్వడమే అసలైన ప్రమాదమని 'ఏఐ & బియాండ్' సీఈవో జస్‌ప్రీత్ బింద్రా హెచ్చరించారు.

మరోవైపు, ఇన్ఫోసిస్‌కు చెందిన తృప్తి రైకర్ ఈ పరిమాణాలపై భిన్నమైన విశ్లేషణ చేశారు. 'ఏఐ' రాకతో జూనియర్ ఉద్యోగాలు మరింత అర్థవంతంగా, సృజనాత్మకంగా మారే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇందులో ఒక ప్రధాన సవాలు పొంచి ఉందని ఆమె గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పని అనుభవం లేని పక్షంలో సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం అలవడదు. వ్యయ నియంత్రణ కోసం కంపెనీలు జూనియర్ల నియామకాలను నిలిపివేస్తే, భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

మొత్తంమీద, ఏఐ కారణంగా ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవ్వడం కంటే, యువత తమ కెరీర్‌లో తొలి అవకాశాన్ని అందిపుచ్చుకుని పని నేర్చుకునే సంప్రదాయ మార్గం అదృశ్యమవ్వడమే పెను సవాల్‌గా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Advertisement
Artificial Intelligence
Entry level jobs
Freshers career impact
AI job displacement
Future workforce skills

More Telugu News