కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. చిన్నారెడ్డిపై వేటు
- పార్టీలో నెలకొన్న వివాదాలకు తెరదించిన కాంగ్రెస్ అధిష్ఠానం
- సురేఖను కేబినెట్ నుంచి తొలగించేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
- ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డి తొలగింపు
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్, పార్టీలో నెలకొన్న తీవ్ర వివాదాలకు అధిష్ఠానం తెరదించింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలిగించేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆమెను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో, ఆమెను కేబినెట్ నుంచి తొలిగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అధికారికంగా సిఫారసు లేఖను పంపించారు. కొండా సురేఖ కుమార్తె సీఎంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సిఫారసులకు, చివరికి బర్తరఫ్‌కు దారితీశాయి.
మరోవైపు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. వీటితో పాటు ఇతర కీలక పదవుల్లోనూ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.