అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు లేకపోవడం సరికాదు: చంద్రబాబు
- వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రకటనల్లో కనిపించని మంత్రి నిమ్మల ఫొటో
- నిమ్మల ఫొటోను ముద్రించకపోవడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు
- భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదని ఆదేశం
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వానికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవడం తీవ్రమైన పొరపాటని, ఇది ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రకటనల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటోను ముద్రించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సమయంలో, అత్యంత సంక్లిష్టమైన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ అధికారుల సమన్వయాన్ని సీఎం అభినందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు నిత్యం ప్రాజెక్టుల వద్దే ఉంటూ, ఎంతో నిరాడంబరతతో పనిచేస్తూ ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటవుతోందని చెప్పారు. ఆంధ్ర పాప్‌కార్న్, అరకు కాఫీ ఉత్పత్తులను రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో తీవ్రరూపం దాలుస్తున్న ఎల్‌నినో పరిణామాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత స్వల్ప వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో 76 శాతం, ప్రకాశం జిల్లాలో 70 శాతం మేర తీవ్ర వర్షపాత లోటు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ఈరోజే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకూడదని, భూగర్భ జలాల ఆధారంగా అవసరమైతే అదనపు బోర్లు వేసేందుకు తక్షణ అనుమతులు ఇవ్వాలని ఆన్నారు.