నా రిటైర్మెంట్ దగ్గరపడిందేమో అని కుటుంబ సభ్యులతో చెప్పాను: తాప్సీ
- కొన్ని రకాల సినిమాలు, మార్కెట్ ధోరణిలపై తాప్సీ విమర్శలు
- కథల ఎంపికలో కాంప్రమైజ్ కాకూడదని వ్యాఖ్య
- ఎలాంటి స్క్రిప్ట్ కైనా ఓకే చెప్పే స్థితిలో లేనని వెల్లడి
ప్రముఖ కథానాయిక తాప్సీ కొంత కాలంగా పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వంలో, కనికా థిల్లాన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ తన బిడ్డ కోసం పోరాడే పవర్‌ఫుల్ తల్లి పాత్రలో తాప్సీ కనిపించారు. ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విడుదలై మంచి స్పందన పొందుతున్న తరుణంలో... తాప్సీ ఇండస్ట్రీ ధోరణిపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ... ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వస్తున్న కొన్ని రకాల సినిమాలు, మార్కెట్ ధోరణిలను చూస్తుంటే తనకు నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచన వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కథల ఎంపికలో నాణ్యత, ప్రమాణాలు తగ్గించుకుని సినిమాలు చేయాల్సిన పరిస్థితి వస్తే, నటించడం మానేసి ప్రశాంతంగా రిటైర్ అవ్వడమే తనకు ఇష్టమని తేల్చి చెప్పారు. గత కొన్ని నెలలుగా థియేటర్లలోకి వస్తున్న చిత్రాల తీరును గమనించి, "నా రిటైర్మెంట్ సమయం దగ్గరపడిందేమో" అని తన కుటుంబ సభ్యులతో కూడా సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలిపారు.
తనకు నటనపై ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, ఎలాంటి స్క్రిప్ట్‌నైనా ఓకే చేసేంత గుడ్డి ప్రేమ మాత్రం కాదని తాప్సీ స్పష్టం చేశారు. మార్కెట్ ట్రెండ్స్ మారుతుంటాయని, కానీ మనం చేసే సినిమాలు చరిత్రగా మిగిలిపోతాయని చెప్పారు. పదేళ్ల తర్వాత తన ఫిల్మోగ్రఫీని తిరిగి చూసుకుంటే తనకైనా, తన అభిమానులకైనా సిగ్గుచేటుగా అనిపించకూడదనేది తన తాపత్రయమని వెల్లడించారు. కష్టపడి సంపాదించుకున్న గుర్తింపును కాపాడుకునేందుకు, తన ప్రమాణాలకు తగిన కథలనే ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు.