అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు, కొత్త పింఛన్లు: నారా లోకేశ్

Nara Lokesh Says Local Body Elections and New Pensions in October
  • రాష్ట్ర మంత్రులతో సమావేశమైన నారా లోకేశ్
  • స్థానిక ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తి లేదని వెల్లడి
  • ఈ ఎన్నికలను వాయిదా వేయించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శ

రాష్ట్ర మంత్రులతో విద్యాశాఖ మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయడం, కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియతో పాటు శాఖాపరమైన పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందజేయాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పారదర్శకంగా అర్హులకు లబ్ధి చేకూర్చాలని మంత్రులకు సూచించారు.


స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని, అక్టోబర్ నాటికే సమగ్ర ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని లోకేశ్ తేల్చి చెప్పారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రభుత్వం చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరిస్తోందని తెలిపారు. మొదట పురపాలక (మున్సిపల్), ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలు క్రమపద్ధతిలో జరుగుతాయని వెల్లడించారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయేలా చేసి రాష్ట్రానికి నష్టం చేకూర్చాలనే లక్ష్యంతో వైసీపీ ఆడుతున్న 'గొడ్డలి రాజకీయాల' కుయుక్తులు ఎంతమాత్రం సాగవని మండిపడ్డారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల భారీ విజయమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు.


మరోవైపు విద్య, సంక్షేమ, వైద్య శాఖలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు పన్నుతున్న కుట్రలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌ల పట్ల మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే, మాట వినని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, సెప్టెంబర్ 9తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఆనాటి కక్షసాధింపు చర్యల నుంచి రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేలా ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి కొరతను ముందస్తు పొదుపు చర్యలతో అధిగమించాలని మంత్రులకు సూచించారు.

Advertisement
Nara Lokesh
Andhra Pradesh Local Body Elections
AP New Pensions October
Chandrababu Naidu
AP Municipal Elections
Andhra Pradesh Government News

More Telugu News