రూ.5 కోట్లకు రేప్‌ కేసుల సెటిల్‌మెంట్‌? పంజాబ్‌ సీఎంపై బీజేపీ సంచలన ఆరోపణలు

BJP alleges Punjab CM Bhagwant Mann settling rape cases for 5 crore
  • భగవంత్‌ మాన్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు
  • రూ.5 కోట్లకు రేప్‌ కేసులు సెటిల్‌ చేస్తున్నారని ఆరోపణ
  • ఆడియో క్లిప్‌లను విడుదల చేసిన బీజేపీ
  • ఆడియోలో లేని మాన్‌, ఆయన భార్య పేర్లు
  • గుర్విందర్‌ సింగ్‌ చాహల్‌ కేసుతో ముడిపడ్డ కేసు
పంజాబ్‌ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆయన భార్య గురుప్రీత్‌ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. మధ్యవర్తుల ద్వారా అత్యాచారం కేసులను రూ.5 కోట్లకు సెటిల్‌ చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ గురువారం మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్‌లను కూడా భండారీ విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి తన రాజకీయ పలుకుబడిని ప్రస్తావిస్తూ అత్యాచారం, ఇతర క్రిమినల్‌ కేసులను పరిష్కరించగలమన్నట్లు మాట్లాడుతున్నారని బీజేపీ తెలిపింది. అయితే ఈ ఆడియోలో భగవంత్‌ మాన్‌, గురుప్రీత్‌ కౌర్‌ పేర్లు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఆ క్లిప్‌ల ఆధారంగానే సీఎం పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ పేర్కొంది.

ఈ వ్యవహారం ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ గుర్విందర్‌ సింగ్‌ చాహల్‌ కేసుతో ముడిపడి ఉంది. ఓ మహిళను అపహరించి అత్యాచారం చేశారనే ఆరోపణలపై చాహల్‌ను పంజాబ్‌ పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. అయితే ఈ వారం ప్రారంభంలో ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. దీనిపై కూడా రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి.

‘‘భగవంత్‌ మాన్‌, ఆయన భార్య మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తూ కేసులను సెటిల్‌ చేస్తున్నారని’’ భండారీ ఆరోపించారు. రూ.5 కోట్లకు అత్యాచారం కేసులను పరిష్కరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి నివాసం నుంచే ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయా? అని బీజేపీ ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై పంజాబ్‌ ప్రభుత్వం, భగవంత్‌ మాన్‌ నుంచి తక్షణ స్పందన వెలువడినట్లు సమాచారం లేదు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసింది.
Advertisement
Bhagwant Mann
BJP allegations Punjab CM
Rape case settlement controversy
Gurpreet Kaur Punjab
Pradeep Bhandari BJP
Punjab political news

More Telugu News