కొండా సురేఖకు కేఏ పాల్ ఓపెన్ ఆఫర్

KA Paul open offer to Konda Surekha
  • మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయడం దాదాపు ఖరారు
  • ప్రజాశాంతి పార్టీలోకి రావాలంటూ కేఏ పాల్ ఆహ్వానం
  • కాంగ్రెస్ పార్టీలో రెడ్ల పదవులకే భద్రత ఉంటుందని వ్యాఖ్య

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌లో మంత్రి కొండా సురేఖ రాజీనామా ఉదంతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు, ఆ తర్వాత క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించడం తుఫాను రేపింది. ఈ క్రమంలోనే మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడం దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.


ఈ నాటకీయ పరిణామాల మధ్య ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి పదవిని కోల్పోతున్న కొండా సురేఖకు కేఏ పాల్ బహిరంగ ఆఫర్ ఇస్తూ... తమ ప్రజాశాంతి పార్టీ తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వేరే ఏ ఇతర పార్టీలోకీ వెళ్లవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నేతల పదవులకే భద్రత ఉంటుందని... బీసీ, బడుగు, బలహీన వర్గాల నేతల పదవులకు ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.


కాంగ్రెస్‌లో బీసీ నాయకులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించిన కేఏ పాల్.. బడుగు వర్గాలకు నిజమైన న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీయే ఏకైక వేదిక అని చెప్పారు. కొండా సురేఖ కాంగ్రెస్ వీడి తమ పార్టీలోకి వస్తే తగిన గౌరవం, ఉన్నతమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సురేఖ కేబినెట్ నుంచి బయటకు రావడం ఖాయమనే ప్రచారం ముమ్మరమైన వేళ, కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Advertisement
Konda Surekha
KA Paul
Praja Shanti Party
Telangana Politics
Congress Party
Revanth Reddy

More Telugu News