విమర్శలకు భయపడను.. కఠిన నిర్ణయాలు తప్పవు: పీసీబీ ఛైర్మన్ నఖ్వీ
- ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల్లో ఘెరంగా ఓడిపోయిన పాకిస్థాన్
- ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లను ఇంటికి పంపిన పీసీబీ
- వైట్ బాల్ క్రికెట్‌లో జట్టు గణనీయమైన పురోగతి సాధించిందన్న నఖ్వీ
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ మౌనం వీడారు. తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయాల అనంతరం సిరీస్ మధ్యలోనే ఏడుగురు కీలక ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లను అర్ధాంతరంగా జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించివేయడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ, నఖ్వీ బోర్డు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.
పాకిస్థానీ మీడియా సంస్థ 'జియో న్యూస్'తో మాట్లాడిన నఖ్వీ... పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి తీవ్రమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. "తాను విమర్శలకు ఎప్పుడూ భయపడలేదని, ఇకపై కూడా భయపడబోనని" విమర్శకులకు ఘాటు సందేశమిచ్చారు. పీసీబీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే పాకిస్థాన్ క్రికెట్ నాశనమైందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను పీసీబీ ఛైర్మన్‌గా రాకముందు జట్టు ఏ స్థానంలో ఉండేదో ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ఒకసారి సరిచూసుకోవాలని ఎద్దేవా చేశారు. టెస్టు జట్టు విఫలమవుతున్న మాట నిజమే అయినా, వైట్ బాల్ క్రికెట్‌లో జట్టు గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తుచేశారు.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో భంగపడింది. రెండు టెస్టుల్లోనూ ఏ ఒక్క ఇన్నింగ్స్‌లోనూ కనీసం 200 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడం బోర్డును తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో మూడో టెస్టుకు ముందు ఏకంగా మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, ఆమిర్ జమాల్, అఘా సల్మాన్ వంటి కీలక ఆటగాళ్లతో పాటు టెస్ట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను పదవుల నుంచి తొలిగించి స్వదేశానికి పంపించింది. సిరీస్ మధ్యలోనే ఇంత భారీ స్థాయిలో వేటు వేయడం క్రికెట్ చరిత్రలోనే అరుదైన పరిణామంగా మారింది.