హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. 'గంజా క్వీన్' నీతూ బాయిపై ఈడీ రైడ్స్

Neetu Bai ED raids in Hyderabad drugs case investigation
  • హైదరాబాద్‌ గంజాయి కింగ్‌పిన్‌ నీతూ బాయిపై ఈడీ దాడులు
  • మనీలాండరింగ్ ఆరోపణలపై 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
  • ఈగల్, ఎక్సైజ్ శాఖ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ కేసు నమోదు
  • గంజాయి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు, ఆస్తులపై లోతైన దర్యాప్తు
  • కుటుంబ సభ్యుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు అనుమానాలు
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో కీలక నిందితురాలిగా ఉన్న నీతూ బాయి అలియాస్ ‘గంజా క్వీన్’కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నీతూ బాయి, ఆమె అనుచరులతో సంబంధం ఉన్న నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులు నగరంలో కలకలం రేపాయి.

తెలంగాణ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం 'ఈగల్' (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గతంలో నీతూ బాయి, ఆమె ముఠాపై నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ విచారణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 'నశా ముక్త్ భారత్' ప్రచారంలో భాగంగా మాదకద్రవ్యాల కేసులపై కేంద్ర ఏజెన్సీలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన పలు కేసుల్లో నీతూ బాయి పరారీలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి.

ఈగల్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసిన ఈడీ, గంజాయి అమ్మకాల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయం, దానిని ఎలా మళ్లించారనే దానిపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఈ అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలను హవాలా మార్గాల్లో తరలించినట్లు ఈడీ బలంగా అనుమానిస్తోంది. గంజాయి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఈ సోదాల్లో భాగంగా అక్రమ ఆర్జ‌న‌ల‌కు సంబంధించిన ఆధారాలు, ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గంజాయి వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యులు లేదా బినామీల పేర్లతో స్థిరాస్తులు, ఇతర ఆస్తులలో పెట్టుబడిగా పెట్టారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

నానక్‌రామ్‌గూడలోని లోథా బస్తీలో ఉన్న నీతూ బాయి నివాసం, గంజాయి రిటైల్ అమ్మకాలకు అడ్డాగా మారిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె భర్త మున్నా సింగ్, కుమారులు గౌతమ్, గోవింద్, కుమార్తె ఈ వ్యాపారంలో పాలుపంచుకుంటూ గంజాయి ప్యాకింగ్, అమ్మకాలలో సహాయం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈగల్ అధికారులు జరిపిన దాడుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో సహా పలువురు బానిసలు ఆమె ఇంటి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.

అయితే, పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నప్పటికీ నీతూ బాయి అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. 2024లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఆమె నివాసంపై దాడి చేసి 20 కిలోల గంజాయి, రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోదాలు ముగిసిన తర్వాత ఈ దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ వెల్లడించే అవకాశం ఉంది.
Advertisement
Neetu Bai
Enforcement Directorate
Hyderabad Drugs Case
Money Laundering
Ganja Queen
Drug Trafficking

More Telugu News