ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌.. కొత్త వ్యవస్థను తీసుకొచ్చే యోచనలో కేంద్రం

Nitin Gadkari plans new system to cut license points for rash driving
  • డ్రైవింగ్‌ విషయంలో పాయింట్ల విధాన్ని తెచ్చే యోచనలో కేంద్రం
  • ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు లైసెన్స్‌ పాయింట్ల తగ్గింపు
  • పరిమితి దాటితే లైసెన్స్‌ సస్పెండ్‌ లేదా రద్దు
  • సురక్షిత డ్రైవింగ్‌కు ‘గుడ్‌ పాయింట్లు’
  • మంచి డ్రైవర్లకు బీమా ప్రయోజనాలు కల్పించే యోచన
డ్రైవింగ్‌ చేసే వారికి కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి లైసెన్స్‌పై పాయింట్లు తగ్గించే విధానం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తే లైసెన్స్‌ సస్పెండ్‌ లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సురక్షితంగా వాహనం నడిపే వారికి ‘గుడ్‌ పాయింట్లు’ ఇచ్చి ప్రోత్సాహకాలు అందించనున్నారు.

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం 66వ సియామ్‌ వార్షిక సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రతిపాదిత విధానంలో ప్రతి ట్రాఫిక్‌ ఉల్లంఘనకు డ్రైవింగ్‌ లైసెన్స్‌పై పాయింట్లు తగ్గుతాయని చెప్పారు. నిర్ణయించిన పరిమితి దాటితే లైసెన్స్‌ను ముందుగా సస్పెండ్‌ చేసి, ఆ తర్వాత రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

మంచి పాయింట్లు సాధించే డ్రైవర్లకు బీమా సంస్థల నుంచి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. వాహన రిజిస్ట్రేషన్‌కు కూడా ఇదే తరహా పాయింట్ల విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

దేశంలో రోడ్డు ప్రమాదాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో బస్సు ప్రమాదాల్లో 3,855 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 81,780 మంది మరణించారని చెప్పారు. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్ల 14,466 మరణాలు నమోదయ్యాయని, హిట్‌ అండ్‌ రన్‌ ఘటనల్లో 34,030 మంది చనిపోయారని వివరించారు.

రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవింగ్‌ సమయంలో ఫోన్‌ వాడటం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని గడ్కరీ చెప్పారు. భారీ వాహనాలు, నిర్మాణ యంత్రాల డ్రైవర్లకు తప్పనిసరి శిక్షణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. జేసీబీ వంటి సంస్థలు పరికరాలు విక్రయించే ముందే ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు.
Advertisement
Nitin Gadkari
Driving License Points System
Traffic Rules India
Road Safety Regulations
Ministry of Road Transport and Highways
Traffic Violation Penalties

More Telugu News