ఎంబీఏ లేదు.. మాస్టర్స్‌ లేదు.. అయినా యాపిల్ పగ్గాలు ఆయన చేతుల్లోకి!

John Ternus takes charge of Apple without an MBA or Masters degree
  • యాపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్‌ టెర్నస్‌
  • ఆయనకు ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీలు లేవు
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ మాత్రమే
  • 2001లో యాపిల్‌లో కెరీర్‌ ప్రారంభం
  • ఎం-సిరీస్‌ చిప్స్‌ మార్పులో కీలక పాత్ర
ఒక భారీ సంస్థకు సీఈఓ కావాలంటే పెద్ద డిగ్రీలు ఉండాలి.. ప్రపంచంలోని అత్యుత్తమ బిజినెస్‌ స్కూళ్లలో చదివి ఉండాలి.. మేనేజ్‌మెంట్‌లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉండాలి. సాధారణంగా మనకు ఉండే అంచనా ఇదే. కానీ యాపిల్ కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌ కథ మాత్రం దీనికి భిన్నం. ఆయన దగ్గర ఎంబీఏ లేదు. మాస్టర్స్‌ డిగ్రీ కూడా లేదు. ఉన్నది మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ మాత్రమే. కానీ చిన్న విషయాన్నీ వదిలిపెట్టని స్వభావమే ఆయన్ను యాపిల్‌లో అగ్రస్థానానికి చేర్చింది.

కనిపించని స్క్రూలోనూ నాణ్యత వెతికారు
యాపిల్లో తన తొలి ప్రాజెక్టుల్లో ఒకటైన సినిమా డిస్‌ప్లే తయారీ సమయంలో టెర్నస్‌ చూపించిన శ్రద్ధ ఆయన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. మానిటర్‌ వెనుక భాగంలో ఉండే ఓ చిన్న స్క్రూపై ఆయన దృష్టి పడింది. దాన్ని సాధారణ వినియోగదారు చూడకపోవచ్చు. అయినా ఆ స్క్రూ తలపై ఉన్న గీతలను ఆయన మాగ్నిఫైయింగ్‌ గ్లాస్‌తో లెక్కపెట్టారు.

అవి 35 ఉన్నాయని గుర్తించారు. ఉండాల్సింది 25 మాత్రమేనని సప్లయర్‌తో వాదించారు. రాత్రి దాటిపోయినా ఆ విషయాన్ని వదల్లేదు. ‘ఇదంతా అవసరమా?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు. చివరికి ‘సాధారణం కాకపోవచ్చు.. కానీ సరైనదే’ అని నిర్ణయించుకున్నారు.

‘ఎవరూ చూడకపోయినా నాకు ముఖ్యం’
ఉత్పత్తిలో పెట్టిన ప్రతి చిన్న శ్రమకు విలువ ఉంటుందని టెర్నస్‌ నమ్ముతారు. వినియోగదారు ఆ వివరాన్ని గమనించినా.. గమనించకపోయినా నాణ్యతలో రాజీ పడకూడదనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయనను యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌తో పోలుస్తుంటారు. ఉత్పత్తిలో ప్రతి చిన్న అంశాన్నీ జాబ్స్‌ ఎంతో జాగ్రత్తగా పరిశీలించేవారు.

25 ఏళ్ల అనుభవం.. ఇప్పుడు అగ్రస్థానం
టెర్నస్‌ 2001లో యాపిల్‌లో చేరారు. 2013లో హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. 2021లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఐఫోన్‌, మ్యాక్‌, ఐప్యాడ్‌, యాపిల్ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

మ్యాక్‌ కంప్యూటర్లలో యాపిల్ సొంత ఎం-సిరీస్‌ చిప్స్‌కు మారడంలోనూ టెర్నస్‌ కీలక పాత్ర పోషించారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టే ముందు సంస్థ ఆదాయంలో దాదాపు 80 శాతం తెచ్చే ఉత్పత్తుల అభివృద్ధిని ఆయన పర్యవేక్షించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

సోషల్‌ మీడియాలోనూ సింపుల్‌గానే..
టెర్నస్‌ వ్యక్తిగత జీవితం కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఆయన సోషల్‌ మీడియాలో పెద్దగా చురుగ్గా ఉండరు. యాపిల్ తదుపరి సీఈఓగా ప్రకటించిన సమయంలో ఆయన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో కనీసం ఫొటో కూడా లేదని కథనాలు వచ్చాయి. సీఈఓ అయిన తర్వాత ‘ఎక్స్‌’లో ఖాతా తెరిచి తొలి పోస్ట్‌గా కేవలం ‘హలో’ అని రాశారు.

ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి యాపిల్ తదుపరి ఉత్పత్తుల దిశను నిర్ణయించడం. సెప్టెంబర్‌ 9న జరిగే కార్యక్రమంలో కొత్త ఐఫోన్‌ మోడళ్లను ఆయన పరిచయం చేసే అవకాశం ఉంది.
Advertisement
John Ternus
Apple CEO
Apple Hardware Engineering
Steve Jobs
iPhone Mac iPad
Apple Leadership

More Telugu News