వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: రూ. 40 కోట్ల డీల్‌పై అప్రూవర్ దస్తగిరి విచారణ
- దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ
- గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరుల మధ్య రూ.40 కోట్ల డీల్ జరిగినట్టు ఆరోపణలు
- వివేకాను హత్య చేసేందుకు రూ. 5 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు దస్తగిరి వాంగ్మూలం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రతరం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మధ్య జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని విచారిస్తున్నారు. వివేకా హత్య వెనుక ఆర్థిక మూలాలను, మనీ లాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు ఈడీ ఈ దర్యాప్తును వేగవంతం చేసింది.
హత్య వెనుక ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు మరికొందరి మధ్య రూ. 40 కోట్ల డీల్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఈడీ అధికారులు దస్తగిరిని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత అనుమానాస్పదంగా జరిగిన బ్యాంకు లావాదేవీల చిట్టాను బయటకు తీస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు దస్తగిరి తన బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరయ్యారు.
గతంలో సీబీఐ విచారణ సందర్భంగా... వివేకాను హత్య చేసేందుకు తనకు రూ. 5 కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. నాటి సీబీఐ స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల్లోకి బదిలీ అయిందనే విషయాలపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చేపడుతున్న ఈ విచారణతో వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.