పాలన పక్కనపెట్టి ఈవెంట్ మేనేజ్‌మెంట్: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు

Chandrababu Naidu ignores governance for event management says Gudivada Amarnath
  • పోలవరం పనులు పూర్తయినట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్న గుడివాడ
  • నీటిని పంప్ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శ
  • నిజమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేశారని ఆరోపణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలనను పూర్తిగా పక్కనపెట్టి కేవలం ప్రచార ఆర్భాటాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తోనే ముఖ్యమంత్రి కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా ఏమాత్రం పూర్తి కాకపోయినా, అన్నీ పూర్తయినట్లు చిత్రీకరిస్తూ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి కూటమి ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులను దారుణంగా వంచించిందని విమర్శించారు. సహజసిద్ధంగా గ్రావిటీ ద్వారా రావలసిన నీటిని పంపింగ్ సిస్టమ్ ద్వారా తెచ్చి, ఏదో గొప్ప ఘనత సాధించినట్లు ప్రచారం చేసుకోవడం కూటమి ప్రభుత్వ డ్రామాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. పోలవరం కాలువల నిర్మాణంలో చంద్రబాబు నాయుడి పాత్ర ఏమీ లేదని... దివంగత వైఎస్సార్, వైసీపీ అధినేత జగన్ హయాంలోనే మెజారిటీ పనులు పూర్తయ్యాయని చెప్పారు.


గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్లే... చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తన స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక 'ఏటీఎం'లా వాడుకుంటున్నారని అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిజమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి, సొంత అనుకూల వర్గాలకు పనులు కట్టబెడుతూ, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో విద్యా, వైద్య రంగాల పురోగతికి జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పునాదులు పడ్డాయని గుర్తుచేసిన ఆయన, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఆర్భాటాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

Advertisement
Chandrababu Naidu
Gudivada Amarnath
Polavaram Project
Andhra Pradesh Politics
YSRCP
Jagan Mohan Reddy

More Telugu News