మద్రాస్ హైకోర్టులో స్టాలిన్‌కు ఎదురుదెబ్బ
- కొలత్తూర్ నియోజకవర్గంలో ఓటమిపాలైన స్టాలిన్
- ఈవీఎంలు, వీవీపాట్‌లలో అక్రమాలు జరిగాయంటూ పిటిషన్
- పిటిషన్ విచారణార్హం కాదన్న ధర్మాసనం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో ఎదురైన ఓటమిని సవాలు చేస్తూ... ఈవీఎంలు, వీవీపాట్ స్లిప్పుల రీ-కౌంటింగ్ నిర్వహించి ప్రత్యర్థి విజయాన్ని రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, అది విచారణార్హం కాదంటూ కొట్టివేసింది.
వివరాల్లోకి వెళితే... కొలత్తూర్ శాసనసభ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో స్టాలిన్ పరాజయం పాలయ్యారు. అయితే ఈవీఎంలు, వీవీపాట్‌లలో అక్రమాలు జరిగాయని, కొన్ని యంత్రాలు అభ్యర్థి పేరును కూడా గుర్తించడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 100 శాతం వివిపాట్ స్లిప్పులను లెక్కించి, తనను విజేతగా ప్రకటించాలని కోర్టును కోరారు.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(b), ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ఫలితాలను కేవలం 'ఎలక్షన్ పిటిషన్' ద్వారా మాత్రమే సవాలు చేయాల్సి ఉంటుందని, సాధారణ రిట్ పిటిషన్ ద్వారా కాదని స్పష్టం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం స్టాలిన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది.