పులివెందులలో జగన్ కు ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
- రెండు రోజుల పర్యటన నిమిత్తం పులివెందుల చేరుకున్న జగన్
- తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించిన వైసీపీ అధినేత
- రేపు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు చేరుకున్నారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పులివెందుల చేరుకోగా... హెలిప్యాడ్ వద్ద పార్టీ నాయకులు, స్థానిక శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా జగన్ భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో 'ప్రజాదర్బార్' నిర్వహించారు. సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తూ, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ రాత్రికి ఆయన పులివెందులలోని తన స్వగృహంలోనే బస చేయనున్నారు.
రేపు ఉదయం 7.45 గంటలకు జగన్ ఇడుపులపాయకు బయల్దేరి వెళతారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.