Advertisement

వెలిగొండపై మాటల యుద్ధం.. జగన్ కు లోకేశ్ కౌంటర్

Nara Lokesh counters Jagan in war of words over Veligonda Project
  • వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం... టీడీపీ, వైసీపీ విమర్శల పర్వం
  • నీళ్లు లేకుండానే జగన్ ప్రాజెక్టును ప్రారంభించారంటూ లోకేశ్ ఎద్దేవా
  • తొలి దశ పూర్తి చేసి నల్లమల సాగర్‌లోకి నీటిని విడుదల చేసిన చంద్రబాబు
  • తన తండ్రి, తన ఘనతేనంటూ ముందురోజు పోస్ట్ పెట్టిన జగన్
ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు వెనుకబడిన ప్రాంతాల దశాబ్దాల కలను సాకారం చేసే వెలిగొండ ప్రాజెక్టు, ఇప్పుడు తెలుగుదేశం, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తెలిసిందే.

నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో, "ఆ విజువల్స్‌ను దగ్గరగా చూడండి" అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. "2024లో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. నీళ్లు లేని ఒక నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంభించారు. ఇలాంటి ఫేక్ ప్రారంభోత్సవం వైసీపీకే సాధ్యం!" అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం 2024 మార్చిలో సొరంగాలు పూర్తి చేసిన సందర్భంగా నీటి ప్రవాహం లేకుండానే ప్రారంభోత్సవం జరిపిందని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నిజంగా నీటిని విడుదల చేసిందని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

కాగా, జగన్ నిన్న ఒక సుదీర్ఘ పోస్ట్‌లో వెలిగొండ ప్రాజెక్టు ఘనత తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిది, తన ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కీలకమైన సొరంగాల పనులను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని, టీడీపీ హయాంలో పనులు నెమ్మదిగా సాగాయని విమర్శించారు. ఈ పోస్టుకు కౌంటర్‌గానే లోకేశ్ తాజా విమర్శలు చేశారు.

సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. తొలి విడతగా 10.7 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు చెందిన సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది.


Advertisement
Nara Lokesh
Veligonda Project
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Nallamala Sagar

More Telugu News