'దసరా' సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'కేజేక్యూ : కింగ్ జాకీ క్వీన్'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, కిరణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా 'యుక్తి తరేజా' మెరిసింది. ఈ నెల 7వ తేదీన విడుదలైన ఈ సినిమా, 28వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి వచ్చింది.
'పార్థ' (దీక్షిత్ శెట్టి) ఓ అనాథ. నగరంలో దిక్కుతోచక తిరుగుతున్న అతణ్ణి ఒక వ్యక్తి చేరదీస్తాడు. నగరంలో రెండు ముఠాల దందా నడుస్తూ ఉంటుంది. ఒక ముఠాకి నాయకుడు 'కమల్ దాస్' అయితే, మరొక ముఠాకి నాయకుడు 'మస్తాన్'. పార్థను చేరదీసిన వ్యక్తి, అతను మాఫియా ముఠాకి నాయకుడు కాగలడని నమ్ముతాడు. పార్థ బలాన్ని పెంచడం కోసం, కమల్ దాస్ కూతురుతో వివాహాన్ని జరిపిస్తాడు. దాంతో కమల్ దాస్ తన అధికారాలను పార్థకి అప్పగించి పక్కకి తప్పుకుంటాడు.
పార్థకి నమ్మిన బంటులా జాకీ (శశి ఓదెలా) ఉంటాడు. అతనితో కలిసి మస్తాన్ ను లేపేయాలని పార్థ నిర్ణయించుకుంటాడు. అప్పుడే నగరంలో తనకి ఎదురులేని విధంగా దందాను కొనసాగించవచ్చని భావిస్తాడు. అదే సమయంలో పార్థకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో ఆడిపాడటానికి హీరోయిన్ 'భార్గవి'( యుక్తి తరేజా)ను సంప్రదిస్తారు. ఆమె 'నో' చెప్పినప్పటికీ, పార్థ ఆమెను ఏమీ అనలేకపోతాడు. ఎందుకంటే తొలి చూపులోనే ఆమె మత్తులో ... అందాల మాయలో పడిపోతాడు.
భార్గవిని చూస్తుండిపోవాలనే ఉద్దేశంతో, ఆమె సినిమాలకు పార్థ నిర్మాతగా మారతాడు. ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. తన భర్తలోని ఈ మార్పును ఆయన భార్య గమనిస్తుంది. పెద్ద మొత్తంలో 'జాకీ'కి సుపారీ ఇచ్చి, భార్గవిని లేపేయమని చెబుతుంది. ఆ విధంగా చేయడం వలన తన భర్త తనకి దక్కుతాడని అంటుంది. అప్పుడు జాకీ ఏం చేస్తాడు? భార్గవికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అటు మస్తాన్ .. ఇటు భార్గవి వైపు నుంచి పార్థకి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.
తల్లి .. తండ్రి .. పరిసరాలు .. పెరిగిన వాతావరణం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రేమ .. అభిమానం .. అనురాగం .. వీటికి అర్థం 'పార్థ'కి తెలియదు. అందుకు కారణం రక్తపాతం అతనిని రాక్షసుడిగా మార్చడమే. తనలోని కోరికను ప్రేమ అనుకుని అతను 'భార్గవి' వెంటపడతాడు. ఆమె నోటి వెంట నుంచి వచ్చిన 'నో' అనే మాట, అతనిలోని రాక్షసుడికి కోపం తెప్పిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది.
'మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాలను నిర్దేశిస్తుంది' అనే కాన్సెప్ట్ తో నిర్మితమైన సినిమా ఇది. ఎవరూ ఆదరించని ఒక అనాథ యువకుడిని ఒక వ్యక్తి చేరదీస్తాడు. అతనికి పిల్లనిచ్చేవాళ్లను చూసి పెళ్లి చేస్తాడు. కండబలం ఉన్న అతని చుట్టూ ధనబలం చేరుతుంది. అనుచరవర్గం పెరుగుతుంది. అయితే ఒక హీరోయిన్ తనను తేలికగా తీసిపారేయడం .. అతని అహం దెబ్బతినడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ కొనసాగుతుంది.
ఇక ఆ హీరోయిన్ పార్థను ఎందుకు పట్టించుకోలేదు .. ఆమె మనసులో ఎవరున్నారు? నగరంలో తన ముఠా పెత్తనమే చెల్లాలనే పార్థ కోరిక నెరవేరుతుందా లేదా అనే అంశాలతో సెకండాఫ్ కథ మలుపులు తీసుకుంటూ వెళుతుంది. అధికారంతో పాటు తాను మనసుపడిన అమ్మాయి ప్రేమను అతను పొందగలిగాడా లేదా? అనే సందేహాలతో సమాధానాలు వెతుక్కుంటూ ప్రేక్షకులు ఫాలో అవుతూ ఉంటారు.
హైదరాబాద్ లో జరిగే రెండు మాఫియా ముఠాల మధ్య కొట్లాట. ఆ రెండు వర్గాల మధ్యలో నడిచే ఒక వన్ సైడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా కనిపిస్తుంది. అధికారం కోసం .. అందుకు అవసరమైన ధనం కోసం .. అనుకున్నది సాధించడం కోసం మాఫియా ముఠాల మధ్య గొడవలు జరగడం, ఇక అమ్మాయిల విషయంలో ప్రాణస్నేహితుల మధ్య తేడాలు రావడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి ఒక రొటీన్ కథగానే ఇది కనిపిస్తుంది.
ఎలాంటి ఆదరణ లేని ఇద్దరు అబ్బాయిలు, మాఫియా చట్రంలో చిక్కుకోవడం సహజంగానే అనిపిస్తుంది. అయితే ఒక స్టార్ హీరోయిన్ పాత్ర ధోరణి మాత్రం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది. తనని ప్రేమించమంటూ హీరోయిన్ భార్గవిని పార్థ బెదిరిస్తాడు. అతనికి దూరంగా ఆమె వెళ్లిపోవచ్చు. కానీ ఆమె అలా చేయకుండా పార్థపై రివేంజ్ ప్లాన్ చేస్తుంది. అతని స్నేహితుడిని వలలో వేసుకుంటుంది. ఇవన్నీ అనవసరమైన విషయాలుగా అసహనాన్ని కలిగిస్తాయి.
ప్రధానమైన పాత్రధారులంతా బాగానే చేశారు. నగేశ్ ఫొటోగ్రఫీ ..పూర్ణచంద్ర తేజస్వి నేపథ్య సంగీతం .. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. తుపాకీతో అధికారాన్ని .. ధనాన్ని గెలుచుకోవచ్చు గానీ, మగువ మనసును గెలుచుకోలేము' అనే సందేశం ఈ కథలో కనిపిస్తుంది. అక్కడక్కడా హింస .. అభ్యంతరకర సన్నివేశాలు కలిగిన ఈ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరంగానే కనిపిస్తుంది.
'కేజేక్యూ : కింగ్ జాకీ క్వీన్'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
KJQ Review
Movie Details
Movie Name: KJQ
Genre: Crime
Release Date: 2026-08-28
Cast: Shashi Odela, Yukti Thareja, Dheekshith Shetty
Director: Kiran Kumar
PRO: -
Music: Poornachandra Tejaswi
Banner: SLV Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer