Advertisement

ఒకే గుడ్డులో రెండు పచ్చసొనలు ఎలా? దీని వెనుక అసలు సైన్స్‌ ఇదే!

Double Yolk Egg Science and how two yolks are formed in one shell
  • రెండు పచ్చసొనలు ఒకేసారి విడుదలైతే డబుల్‌ యోక్‌
  • చిన్న కోళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి
  • జన్యుపరమైన కారణాలూ ప్రభావం చూపుతాయి
  • డబుల్‌ యోక్‌ గుడ్లు తినడం సురక్షితమే
  • ఒకే గుడ్డులో తొమ్మిది పచ్చసొనలు ఇప్పటి వరకు రికార్డు
గుడ్డు పగలగొట్టగానే లోపల రెండు పచ్చసొనలు కనిపిస్తే.. అది చూసినవారికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ డబుల్‌ యోక్‌ గుడ్లను కొందరు ప్రత్యేకమైనవిగా భావిస్తారు. మరికొందరికి అసలు ఇలా ఎందుకు వచ్చిందనే సందేహం ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి రహస్యం లేదు. కోడి పునరుత్పత్తి వ్యవస్థలో జరిగే సహజ ప్రక్రియే దీనికి కారణం.

కోడి గుడ్డును ఎలా తయారు చేస్తుంది?
కోడి అండాశయంలో పచ్చసొన తొలుత అపరిపక్వ అండకణంగా ఏర్పడుతుంది. అది క్రమంగా పెరుగుతూ పోషక పదార్థాలు చేరడంతో పచ్చసొనగా మారుతుంది. పరిపక్వమైన తర్వాత అండాశయం నుంచి విడుదలవుతుంది. దీన్నే అండోత్సర్గం అంటారు. అనంతరం అది అండవాహికలోకి వెళుతుంది. అక్కడ గుడ్డులోని తెల్లసొన, పొరలు, పెంకు ఒక్కొక్కటిగా ఏర్పడతాయి.

సాధారణంగా ఒకసారి ఒక పచ్చసొన మాత్రమే అండవాహికలోకి వెళుతుంది. కానీ అరుదైన సందర్భాల్లో రెండు పచ్చసొనలు చాలా తక్కువ వ్యవధిలో విడుదలవుతాయి. అవి కలిసి అండవాహికలోకి చేరితే.. వాటి చుట్టూ తెల్లసొన ఏర్పడి చివరకు ఒకే పెంకులో బందీ అవుతాయి. అలా డబుల్‌ యోక్‌ గుడ్డు తయారవుతుంది.

చిన్న కోళ్లలోనే ఎక్కువగా ఎందుకు?
డబుల్‌ యోక్‌ గుడ్లు చిన్న వయసులో గుడ్లు పెట్టడం ప్రారంభించిన కోళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటి పునరుత్పత్తి చక్రం ఇంకా పూర్తిగా క్రమబద్ధంగా ఉండకపోవడమే దీనికి కారణం. అందుకే తక్కువ వ్యవధిలో రెండు పచ్చసొనలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

జన్యుపరమైన కారణాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని కోళ్లలో డబుల్‌ యోక్‌ గుడ్లు పెట్టే అవకాశం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. గుడ్లు పెట్టే చక్రంలో మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు.

రెండు కాదు.. తొమ్మిది పచ్చసొనలు!
ఒకే గుడ్డులో రెండు పచ్చసొనలు కనిపించడం అరుదే అయినా.. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం 1971లో న్యూయార్క్‌కు చెందిన డయాన్‌ హైన్స్‌వర్త్‌ తొమ్మిది పచ్చసొనలు ఉన్న గుడ్డును గుర్తించినట్లు నమోదైంది. మరోవైపు కొన్ని గుడ్లలో పచ్చసొన అసలు ఉండదు. వీటిని డ్వార్ఫ్‌ లేదా ఫెయిరీ ఎగ్స్‌ అంటారు. గుడ్లు పెట్టడం ప్రారంభించే చిన్న కోళ్లలో ఇవి కనిపిస్తాయి.

తినొచ్చా? పోషకాలు ఎక్కువేనా?
డబుల్‌ యోక్‌ గుడ్లను తినడం పూర్తిగా సురక్షితమే. సాధారణ గుడ్లలాగే వీటిని వంటల్లో ఉపయోగించవచ్చు. రెండు పచ్చసొనలు ఉండటంతో సాధారణ గుడ్డుతో పోలిస్తే ప్రోటీన్‌, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పచ్చసొనకు సంబంధించిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుడ్డు పరిమాణం, రెండు పచ్చసొనల పరిమాణాన్ని బట్టి పోషక విలువలు మారుతాయి.
Advertisement
Double Yolk Egg
Chicken Ovulation Process
Poultry Science
Egg Nutrition Facts
Two Yolks One Egg
Guinness World Record Eggs

More Telugu News