Advertisement

వెలిగొండ సొరంగంలో కృష్ణా జలాల ప్రవాహం చరిత్రాత్మకం: నారా లోకేశ్

Nara Lokesh says Krishna water flow in Veligonda tunnel is historic
  • వెలిగొండ ప్రాజెక్టు రేపు జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు
  • ఇవాళ తొలిసారిగా సొరంగంలోకి ప్రవహించిన కృష్ణా జలాలు
  • ఇది చరిత్రాత్మక ఘట్టమన్న మంత్రి నారా లోకేశ్
  • ఫేజ్-1తో లక్షలాది మందికి సాగు, తాగునీటి ప్రయోజనం
మూడు దశాబ్దాల సుదీర్ఘ స్వప్నం ఎట్టకేలకు సాకారమైందని, వెలిగొండ ప్రాజెక్టు సొరంగం గుండా తొలిసారిగా కృష్ణా జలాలు ప్రవహించడం చరిత్రాత్మకమని రాష్ట్ర మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ పేర్కొన్నారు. కరవు పీడిత ప్రాంత ప్రజలు తరతరాలుగా ఎదురుచూస్తున్న క్షణం ఆవిష్కృతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సంతోషాన్ని పంచుకుంటూ కీలక వివరాలు వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఈ ప్రాజెక్టు ఫేజ్-1ను జాతికి అంకితం చేసి, 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌లోకి విడుదల చేస్తారని లోకేశ్ తెలిపారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఈ పరివర్తనాత్మక ప్రాజెక్టుకు చంద్రబాబే శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సొరంగం నుంచి తొలిసారిగా నీరు బయటకు వస్తుండటాన్ని చూడటం చాలా భావోద్వేగంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

"ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు. మన రైతులకు, కుటుంబాలకు, మొత్తం వెనుకబడిన ప్రాంతానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జీవనాడి" అని లోకేశ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారానే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, దాదాపు 4 లక్షల మంది ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయని వివరించారు. 'వెలిగొండ జలసిరులు' నిజంగా ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయని ఆయన అభివర్ణించారు. దశాబ్దాల తరబడి కరవుతో అల్లాడిన ప్రకాశం జిల్లా వాసుల కళ్లలో ఈ ప్రాజెక్టు ఆనందం నింపుతుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Nara Lokesh
Veligonda Project
Krishna Waters
Chandrababu Naidu
Nallamala Sagar
Prakasam Irrigation

More Telugu News