జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసం: అచ్చెన్నాయుడు
- పోలవరం పనులను జగన్ నిర్లక్ష్యం చేశారన్న అచ్చెన్నాయుడు
- ఆ ప్రాజెక్టును గోదావరి జలాల్లో ముంచేశారని మండిపాటు
- గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును ప్రారంభిస్తామని వెల్లడి
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలవరం పనులను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించి ఉంటే రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుపై 16 నెలల్లోనే రూ.3,500 కోట్లు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించామని అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 74 శాతం మేర పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం రాగానే ఒక ఏడాది పాటు నిరంతరాయంగా పూర్తి చేసి ఉంటే ఇక్కట్లన్నీ తీరేవని, కానీ ఆ ప్రాజెక్టును గోదావరి వరదల్లో ముంచేసి నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తిరిగి పోలవరాన్ని గాడిలో పెట్టిందని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అలాగే, 1995లో వెలిగొండ ప్రాజెక్ట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారని... ఇప్పుడు ప్రాజెక్ట్‌ను ఆయనే పూర్తి చేసి, జాతికి అంకితం చేయబోతున్నారని చెప్పారు. గతంలో తొండలు కూడా గుడ్లు పెట్టని రాతి నేలల్లో వెలిగొండను నిర్మించామని, పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు త్వరలోనే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తాకబోతున్నాయని వెల్లడించారు.