నకిలీ వైద్యులపై కఠిన నిఘా.. హైదరాబాద్ లో 12 మంది అరెస్ట్.. సజ్జనార్ తీవ్ర హెచ్చరిక
- నకిలీ వైద్యులపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం
- విద్యార్హతలు లేని కొందరు డాక్టర్లమంటూ చెలామణి అవుతున్నారన్న సజ్జనార్
- నకిలీ డాక్లర్ల బారిన పడొద్దని ప్రజలకు హెచ్చరిక
వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో కనీస అర్హతలు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 12 మందిని గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.
కనీస వైద్య విద్యార్హతలు, ఎలాంటి పరిజ్ఞానం లేని కొందరు వ్యక్తులు తాము డాక్టర్లమంటూ చెలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, డయాబెటిస్ మందులను ఇస్తూ, ఇష్టారీతిన ఇంజక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తున్నారని తెలిపారు. ఇటువంటి శాస్త్రీయత లేని వైద్యం వల్ల బాధితుల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా నకిలీ డాక్టర్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. క్లినిక్ లేదా ఆసుపత్రి రిసెప్షన్ వద్ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందో లేదో కచ్చితంగా గమనించాలని తెలిపారు. అలాగే వైద్యుడి బోర్డుపై పేరు, చదివిన విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ వైద్యుడి అర్హతలపై కొద్దిగా అనుమానం వచ్చినా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు చెక్ చేసుకోవచ్చని, రికార్డుల్లో వివరాలు కనిపించకపోతే ఆ వైద్యుడిని నకిలీగా పరిగణించవచ్చని స్పష్టం చేశారు.
తీసుకుంటున్న చికిత్సపై సందేహాలు ఉంటే వెంటనే అర్హత కలిగిన మరో డాక్టర్ వద్ద 'సెకండ్ ఒపీనియన్' తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఎవరైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే 'డయల్ 112' కి గానీ, స్థానిక పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలని కోరారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే నకిలీ డాక్టర్లపై నిరంతరం తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.