కేసీఆర్ పాలన ప్రజా సంక్షేమంగా సాగితే.. రేవంత్ పాలన భూముల వ్యాపారంగా సాగుతోంది: హరీశ్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందన్న హరీశ్
- పార్కులు, ప్లాట్లు, ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే అక్కడ భూములను అమ్మేస్తున్నారని ఆరోపణ
- లక్షల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొంటున్నారని మండిపాటు
నాడు కేసీఆర్ పాలన ప్రజా సంక్షేమ కేంద్రంగా సాగితే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలన భూముల వ్యాపారం కేంద్రంగా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన 22ఏ బాధితుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి ఎకరాలను, ఒక్క హైదరాబాద్‌లోనే లక్షలాది ఆస్తులను రేవంత్ ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ... జాబితా నుంచి భూములను తొలగించడానికి 30 శాతం వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ 22ఏ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. బాధితులు ఎవరూ బ్రోకర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని, ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్‌ఎస్ పూర్తిగా తీసుకుంటుందని హామీ ఇచ్చారు.