ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 'టగ్ ఆఫ్ వార్'.. హెచ్చరించిన ఐఎంఎఫ్

IMF warns of tug of war in global economy
  • ఆయిల్ షాక్, ఏఐ బూమ్ మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గుంజులాట
  • పశ్చిమాసియాలో ఇంధన సరఫరా ఆటంకాలతో ప్రతికూల ప్రభావం
  • కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడుల జోరుతో సానుకూల వాతావరణం
  • రెండు శక్తుల మధ్య గ్లోబల్ ఎకానమీ నలిగిపోతోందన్న ఐఎంఎఫ్ చీఫ్
  • ప్రతికూలతలున్నా ప్రపంచ వృద్ధిలో నిలకడ కనిపిస్తోందని వెల్లడి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక భారీ 'టగ్ ఆఫ్ వార్' స్థితిని ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా వ్యాఖ్యానించారు. ఒకవైపు పశ్చిమాసియాలో ఇంధన సరఫరా ఆటంకాలతో తలెత్తిన ప్రతికూలతలు, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడుల వెల్లువతో పెరిగిన డిమాండ్ - ఈ రెండు పరస్పర విరుద్ధ శక్తుల మధ్య గ్లోబల్ ఎకానమీ నలిగిపోతోందని ఆమె విశ్లేషించారు. జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందు వాషింగ్టన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

పశ్చిమాసియాలో హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఊహించిన దానికంటే మెరుగ్గానే తట్టుకోగలిగిందని జార్జియేవా తెలిపారు. చమురు, గ్యాస్ నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, గల్ఫ్ యేతర దేశాల నుంచి సరఫరాలు పెరగడం, ఇంధన వినియోగం తగ్గడం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వృద్ధి చెందడం వంటి అంశాలు దీని ప్రభావాన్ని తగ్గించాయని ఆమె వివరించారు.

ఇదే సమయంలో, ఏఐ రంగంలో పెట్టుబడుల జోరు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని ఆమె నొక్కి చెప్పారు. 'అమెరికాలో ప్రారంభమైన ఏఐ విప్లవం ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారుతోంది. ఇతర దేశాలు సైతం డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తున్నాయి' అని ఆమె పేర్కొన్నారు.

ఈ రెండు శక్తుల ప్రభావం ఒక్కో దేశంపై ఒక్కో రకంగా ఉంటుందని జార్జియేవా స్పష్టం చేశారు. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం భారమై, వడ్డీ రేట్లను తగ్గించకుండా సెంట్రల్ బ్యాంకులు కఠిన వైఖరిని అవలంబించే ముప్పు ఉందని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే పేద దేశాలపై రుణ భారం మరింత పెరగవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభం ఇంకా పూర్తిగా సమసిపోలేదని, అధిక అప్పులు, ద్రవ్యోల్బణం, వాణిజ్య ఉద్రిక్తతల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటివరకు నిలకడగానే ఉందని ఆమె వెల్లడించారు.
Advertisement
Kristalina Georgieva
IMF
Global Economy
Artificial Intelligence
Energy Crisis
Inflation

More Telugu News