గుడ్ల కంటే సోయాలో 4 రెట్ల ప్రొటీన్‌.. కానీ ఈ ట్విస్ట్‌ తెలుసా?

Soya has 4 times more protein than eggs but know this twist
  • 100 గ్రాముల పొడి సోయాలో 52 గ్రాముల ప్రొటీన్‌
  • 100 గ్రాముల గుడ్లలో సుమారు 13 గ్రాముల ప్రొటీన్‌
  • ఉడికిన సోయాలో ప్రొటీన్‌ లెక్క గణనీయంగా తగ్గుతుంది
  • సోయా నీటిని పీల్చుకుని దాదాపు మూడు రెట్లు బరువు పెరుగుతుంది
  • అధికంగా తింటే గ్యాస్‌, ఉబ్బరం సమస్యలు
ప్రొటీన్‌ కోసం గుడ్లు తినేవారికి సోయా చంక్స్‌ మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా శాకాహారులకు ఇది చౌకగా లభించే ప్రొటీన్‌ వనరు. అయితే ఇందులోని ప్రొటీన్‌ లెక్కను చూసి అపోహ పడకూడదు. పొడి సోయా చంక్స్‌, ఉడికిన తర్వాత తీసుకునే సోయా చంక్స్‌ మధ్య చాలా తేడా ఉంటుంది.

100 గ్రాముల పొడి సోయా చంక్స్‌లో దాదాపు 52 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అదే 100 గ్రాముల పచ్చి లేదా ఉడికించిన గుడ్లలో సుమారు 13 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అంటే లెక్క ప్రకారం సోయా చంక్స్‌లో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ప్రొటీన్‌ ఉన్నట్లే.

గుడ్లలో శరీరానికి అవసరమైన తొమ్మిది కీలక అమైనో ఆమ్లాలు ఉంటాయి. విటమిన్‌ బీ12, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కోలిన్‌ వంటి పోషకాలూ లభిస్తాయి. సోయా చంక్స్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ ఉండదు.

52 గ్రాముల ప్రొటీన్ తో కూడిన 100 గ్రాముల పొడి సోయా చంక్స్‌ ను నీటిలో నానబెట్టి ఉడికిస్తే దాదాపు మూడు రెట్లు బరువు పెరుగుతాయి. దీంతో 100 గ్రాముల సోయా చంక్స్‌ ఉడికిన తర్వాత వాటిలో ప్రొటీన్‌ సుమారు 13 నుంచి 15 గ్రాములే ఉంటుంది.

పొడి సోయా చంక్స్‌ 100 గ్రాములు తినాలంటే ఉడికిన తర్వాత దాదాపు 300 గ్రాముల ఆహారం అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి తింటే కొందరికి గ్యాస్‌, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావొచ్చు. సోయాలో ఉండే ఫైటిక్‌ యాసిడ్‌ వంటి పదార్థాలు ఖనిజాల శోషణను ప్రభావితం చేయొచ్చు. బాగా ఉడికించి, నీటిని వంపేయడం వల్ల వీటి ప్రభావం తగ్గుతుంది.

గుడ్లు సాధారణంగా జీర్ణం కావడం సులభంగా ఉండొచ్చు. అయితే పచ్చసొనలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ ఉంటాయి. మొత్తంగా చూస్తే.. గుడ్లు, సోయా చంక్స్‌ రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. ఒక్కదానిపైనే ఆధారపడకుండా వివిధ ప్రొటీన్‌ వనరులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆహార అవసరాల కోసం వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.
Advertisement
Soya Chunks
Protein rich foods
Soya chunks vs eggs
Vegetarian protein sources
Nutrition comparison
Soya chunks health benefits

More Telugu News