అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ పాలనలో 'అన్యమత ప్రదేశ్'గా మార్చారు: భానుప్రకాశ్ రెడ్డి
- వైసీపీ పాలనలో హిందూ ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరిగాయన్న భానుప్రకాశ్ రెడ్డి
- సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఎవరు యత్నించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక
- విజయసాయి ఆరోజే సనాతన ధర్మం గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో, ధాన్యంతో అలరారే 'అన్నపూర్ణ' వంటి ఆంధ్రప్రదేశ్‌ను 'అన్యమత ప్రదేశ్'గా మార్చివేశారంటూ జగన్‌పై దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు జరిగాయని, విగ్రహాల చేతులను సైతం ఖండించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నించినా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సనాతన ధర్మానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడేందుకు బీజేపీ కంకణబద్ధమై ఉందన్నారు. విజయసాయిరెడ్డి ఆరోజే సనాతన ధర్మం గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉన్నప్పుడు కాకుండా, బయటకు వచ్చాక మాట్లాడితే దాని విలువ తగ్గుతుందని అన్నారు.
అలాగే, కాకినాడలో చోటుచేసుకున్న సౌజన్య ‘లవ్ జిహాద్’ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిందని... దేశంలో వేలాది మంది యువతులు ఈ నెట్‌వర్క్‌కు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన సాదిక్ లాంటి వ్యక్తుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ‘టోల్ ఫ్రీ’ నంబర్‌తో పాటు పోలీసు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... దీనిపై ఏపీ డీజీపీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.