రేవంత్ ప్రెస్‌మీట్ గురించి మంత్రులకే సమాచారం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- మంత్రుల మధ్య సయోధ్య లేదన్న ప్రవీణ్ కుమార్
- రేవంత్ ప్రెస్‌మీట్ కి సహచర మంత్రులు హాజరు కాలేదని ఎద్దేవా
- పాలనా యంత్రాంగం ఎలా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్య
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీవ్ర అస్తవ్యస్థంగా ఉందనడానికి కేబినెట్‌లోని మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడమే నిదర్శనమని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా లండన్ పర్యటన నుంచి వచ్చి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంపై అత్యవసర ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే... ఆయన పక్కన ఉండాల్సిన కేబినెట్ మంత్రులకు ఆ సమావేశం గురించిన సమాచారం కూడా లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఒకే సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం ముగించిన కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ పెట్టినప్పటికీ, ఆయన సహచర మంత్రులెవరూ ఆ భేటీకి హాజరుకాకపోవడాన్ని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎత్తిచూపారు.
రాష్ట్రంలో పాలనా యంత్రాంగం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని, ఒక ముఖ్యమైన అంశంపై నిర్ణయం తీసుకునే విషయంలో స్వయంగా కేబినెట్‌లోని మంత్రుల మధ్యే సయోధ్య, కనీస సమాచారం లేని పరిస్థితి నేడు తెలంగాణలో నెలకొందని ఆయన విమర్శించారు.