ప్రభుత్వం తప్పు చేస్తే.. ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి?: హరీశ్ రావు
- 22ఏ బాధితుల సమావేశానికి హాజరైన హరీశ్ రావు
- లక్షలాది మందికి కంటిమీద కునుకు లేకుండా చేశారని మండిపాటు
- పొంగులేటి అత్యాశ ఆయన దుఃఖానికి కారణమవుతుందని వ్యాఖ్య
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన 22ఏ (22A) బాధితుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానందతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తప్పు చేసింది ప్రభుత్వమైతే, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు.
వందలాది కాలనీల అధ్యక్షులు, వేలాది మంది బాధితులు తమ భూములను నిషేధిత 22ఏ జాబితాలో పెట్టారంటూ ఆవేదనతో ఇక్కడికి వచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. "భూములను 22ఏలో పెట్టడం మీ వంతు.. మళ్లీ వాటిని తొలగించుకోవడానికి దరఖాస్తులు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రజల వంతా?" అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సూటిగా నిలదీశారు. ప్రభుత్వం చేసిన తప్పును వెంటనే సవరించాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉందన్నారు. లక్షలాది మంది ఆస్తులను రాత్రికి రాత్రి 22ఏ జాబితాలో చేర్చి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశారని మండిపడ్డారు.
30 శాతం కమీషన్ల దురాశతోనే ఈ భూములన్నింటినీ 22ఏలో పెట్టారంటూ హరీశ్ రావు ఆరోపించారు. మంత్రి అత్యాశ ఏదో ఒకరోజు ఆయన దుఃఖానికి కారణమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ కుట్రల వల్ల లక్షలాది మంది జీవితాలు నాశనమవుతున్నాయని... పిల్లల పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని, దవాఖాన ఖర్చుల కోసం ఆస్తులను బ్యాంకుల్లో కుదువ పెడదామంటే బ్యాంకులు సైతం తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాపర్టీల విలువలు పడిపోయి, అప్పు పుట్టక, ఆస్తులు అమ్ముకోలేక బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రజలతో ఆన్‌లైన్ దరఖాస్తులు పెట్టించకుండా, ప్రభుత్వం వెంటనే ఈ 22ఏ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.